ఎండకు అమ్మ తగ్గకతప్పలేదు

Update: 2016-04-23 10:01 GMT
ఎంతటి వారినైనా సరే తనకు తగ్గట్లు మార్చుకునే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కాస్త వెనక్కి తగ్గారు. తాను అనుకున్నది జరిగి తీరాలని భావించే అమ్మ.. ఒకసారి డిసైడ్ అయ్యాక వెనక్కి తగ్గేందుకు ఏ మాత్రం ఇష్టపడరు. అలాంటి అమ్మ తాజాగా తగ్గారు. మంటలు పుట్టించే ఎండ దెబ్బకు ఎన్నికల ప్రచార సభలకు వస్తున్న ప్రజలు పిట్టల్లా రాలిపోయిన తీరుతో ఆమె వెనక్కి తగ్గారు.

విడిగా అయితే ఇలాంటి వాటిని లైట్ తీసుకునే అవకాశం ఉన్నా.. ఎన్నికల వేళ.. లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవటానికి సిద్ధంగా లేని అమ్మ.. భానుడి దెబ్బకు భయపడ్డారు. గడిచిన మూడు రోజుల్లో అమ్మ జయలలిత నిర్వహిస్తున్న ప్రచార సభలకు హాజరైన వారిలో ఐదుగురు మరణించటం తీవ్ర విమర్శలకు గురి చేసింది. ఉదయం.. మధ్యాహ్న వేళల్లో అమ్మ సభల కోసం జనాలు పెద్ద ఎత్తున ఎదురుచూడటం.. చెప్పిన షెడ్యూల్ కంటే నాలుగైదు గంటలు ఆలస్యంగా వస్తున్న అమ్మ తీరు కారణంగా.. అభిమానంగా సభలకు వస్తున్న వారు విలవిలలాడిపోతున్నారు.

ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. అమ్మ ప్రచార సభలకు వచ్చిన వారిలో ఐదుగురు మరణించిన నేపథ్యంలో అమ్మ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. తన ప్రచార సభల్ని సాయంత్రం వేళకు మార్చుకున్నారు. ఇకపై సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ప్రచార సభల్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ కారణంగా అమ్మ హాజరయ్యే సభల సంఖ్య తగ్గే అవకాశం ఉండటంతో.. సభల్లో వీలైనంత ఎక్కువ మందిని ప్రజలకు పరిచయం చేయాలని భావిస్తున్నారు.
Tags:    

Similar News