శ‌బ‌రిమ‌ల టెంపుల్లో మ‌హిళ‌ల పూజ రాజ్యాంగ హ‌క్కు!

Update: 2018-07-19 04:07 GMT
మ‌రో సంచ‌ల‌న వ్యాఖ్య చేసింది సుప్రీంకోర్టు. కొన్నేళ్లుగా కొన‌సాగుతున్న వివాదానికి చెక్ పెడుతూ.. కేర‌ళ‌లోని శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి మ‌హిళ‌లు పూజ‌లు చేయ‌టంపై స్ప‌ష్ట‌త‌ను ఇచ్చింది. శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి ప్ర‌వేశించి.. పూజ‌లు చేయ‌టం రాజ్యాంగ హ‌క్కుగా వ్యాఖ్యానించింది. ఈ విష‌యంలో లింగ వివ‌క్ష‌కు తావు లేదంది. 

ప‌దేళ్ల నుంచి యాభై ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు బాలిక‌లు.. మ‌హిళ‌ల‌కు ఆల‌య ప్ర‌వేశాన్ని నిషేధిస్తూ దేవ‌స్థానం తీసుకున్న నిర్ణ‌యంపై భార‌త యువ న్యాయ‌వాదుల సంఘం త‌దిర‌త పార్టీలు దాఖ‌లు చేసిన వ్యాజ్యం బుధ‌వారం విచార‌ణ‌కు వ‌చ్చింది.

దీనిపై సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా.. జ‌స్టిస్ ఆర్ ఎఫ్ నారిమ‌న్‌.. జ‌స్టిస్ ఎఎం ఖ‌న్విల్క‌ర్.. జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్‌.. జ‌స్టిస్ ఇందూ మ‌ల్హోత్రాల‌తో కూడిన రాజ్యాంగ ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. ఆల‌యంలోకి పురుషుడు వెళ్ల‌గ‌లిగిన‌ప్పుడు.. మ‌హిళ కూడా వెళుతుంద‌ని.. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 25.. 26 ప్ర‌కారం పురుషుల‌కు వ‌ర్తించేవ‌న్నీ మ‌హిళ‌ల‌కు వ‌ర్తిస్తాయ‌ని ధ‌ర్మాస‌నం పేర్కొంది. 

శ‌బ‌రిమ‌ల ఆల‌యంలో మ‌హిళ‌ల‌కు ప్ర‌వేశం క‌ల్పించేందుకు వీలుగా కేర‌ళ ప్ర‌భుత్వం 2015లో సుప్రీంకు తొలి అఫిడ‌విట్‌ ను దాఖ‌లు చేసింది. దీనికి విరుద్ధ‌మైన అభిప్రాయంతో 2017లో మ‌రో అఫిడ‌విట్‌ ను స‌మ‌ర్పించింది. దీనిపై సుప్రీం ప్ర‌శ్నించ‌గా.. తాము మొద‌టి అఫిడ‌విట్‌ కే క‌ట్టుబ‌డి ఉంటామ‌ని స్ప‌ష్టం చేసింది.

దీనిపై సుప్రీం స్పందిస్తూ.. స‌మ‌యానుకూలంగా మారిపోతున్నారంటూ వ్యాఖ్యానించింది. పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాది ఇందిరా జైసింగ్ త‌న వాద‌న‌లు వినిపిస్తూ.. ప్ర‌త్యేకంగా ఒక వ‌యో వ‌ర్గానికి చెందిన మ‌హిళ‌ల్ని మాత్ర‌మే ఆల‌య ప్ర‌వేశాన్ని నిరాక‌రించ‌టంతో ప‌లు ప్రాథ‌మిక హ‌క్కుల‌ను ఉల్లంఘించ‌టంతో పాటు అంట‌రానిత‌నం కింద‌కూ వ‌స్తుంద‌ని వాదించారు. ఈ రోజూ (గురువారం) ఈ అంశంపై సుప్రీం విచారించ‌నుంది.
Tags:    

Similar News