'కాపు' కాయాల్సిందే... లేదంటే టీడీపీకి గత చేదు అనుభవం తప్పదు?

Update: 2022-12-23 04:17 GMT
ఏపీలో 'కాపు' కాసేదెవరు.? 'గోదారి' మదిని దోచెదెవరు? గోదారోళ్లే ఏపీ నాయకత్వాన్ని డిసైడ్ చేసేది.. గోదారోళ్లు ఎటుంటే వాళ్లదే రాజ్యాధికారం. అందుకే ఇక్కడి 'కాపు'లదే కీరోల్.. వాళ్లు ఎంటుంటే రాష్ట్రం అటే. ఏపీ రాజకీయాల గెలుపోటములను డిసైడ్ చేసే శక్తి అనాధిగా 'గోదావరి జిల్లాలకు' ఉంది. ఎన్టీఆర్ నుంచి నేటి వరకూ కాపుల మద్దతు లేనిదే ప్రభుత్వాలు ఏర్పాటు కావు. ఏపీ రాజకీయాలు గోదావరి జిల్లాలతోనే ప్రముఖంగా ముడిపడి ఉన్నాయంటే అందులో సందేహం లేదు. ఎందుకంటే కాపు సామాజికవర్గం ఈ జిల్లాల్లోనే ఎక్కువ. అందుకే రాజకీయ నాయకులంతా ఈ జిల్లాలపైనే దృష్టిని కేంద్రీకరిస్తుంటారు. దీనికి తోడు పవన్ కల్యాణ్ ప్రత్యక్ష రాజకీయాలతో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి.

అందుకే ఆంధ్రా ప్రాంతంలో అపర చాణక్యుడు చంద్రబాబు కంటే పవన్ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. తనకు అన్ని సామాజిక వర్గాలు సమానమే అని చెబుతున్నప్పటికీ అతర్గంతంగా మాత్రం కాపులే ఎక్కువగా ఆయన వైపు మొగ్గు చూపుతున్నారనేది నగ్న సత్యం. గోదావరి జిల్లాల్లో అగ్రస్థానంలో ఉన్న ఈ వర్గానికి లీడర్ అవడానికి అంతా సర్వశక్తులూ ఒడ్డుతుంటారు. అందులో భాగంగా ముద్రగడ పద్మనాభం ఓ లీడర్ గా ఓ వెలుగు వెలిగి మళ్లీ తెర వెనక్కి వెళ్లారు. మాజీ మంత్రి, టీడీపీ భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సైతం ఈ సామాజిక వర్గానికి నాయకత్వం వహించేందుకు ఉవ్విళ్లూరారు. ప్రస్తుతం కాపు సంక్షేమ సేనకు మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే ఎవ్వరూ శాశ్వతంగా కాపు లీడర్ హోదాను పొందలేకపోయారు.

-'ఆంధ్రా”లో రాజకీయ విశ్లేషణ...

ఏపీలో ఓ నానుడి ఉంది. ఆంధ్రా ప్రాంతాల్లో అత్యధిక సీట్లు కొల్లగొట్టిన వారిదే అధికారం అనేది ఓ నమ్మకంగా కొనసాగుతోంది. అయితే అందరిలోనూ చిక్కువీడని ప్రశ్నలు వెంటాడుతున్నాయి. జనసేన అధినేత టీడీపీతో కలిసి అడుగు వేస్తారా? లేక విడిగా పోటీకి సై అంటారా? ఒక వేళ ఒంటరి పోరుకు దిగితే ఏమవుతుంది. ఎవరిది పై చేయి అవుతుంది. మరి అధికార పార్టీ ఆలోచన ఏమిటి? వారి రాజకీయ చతురత ఏమిటి? అనే ప్రశలు అందరి మెదళ్లను తొలిచేస్తున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానలు దొరకాలంటే మరో ఏడాదిన్నర ఆగక తప్పదు. అయితే కొందరు విశ్లేషకులు మాత్రం గత ఏడాది చేసిన తప్పును టీడీపీ, జనసేన పార్టీలు చేయవనే భావిస్తూ అనేక రకాల ఈక్వేషన్లు వేస్తున్నారు. అందులో నిజమెంతో తెలియదు కానీ ఓ రకంగా కలయికే నిజం కావచ్చేమో అనే ఊహాగానాలే వ్యక్తమవుతున్నాయి.
ఈక్వేషన్లు ఎలా ఉండబోతున్నాయి..

గత ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.. 49 శాతానికి పైగా ఓటింగ్ ను కొల్లగొట్టిన వైసీపీ 151 అసెంబ్లీ సీట్లను విజయం సాధించి అధికార పీఠాన్ని చేజిక్కించుకుంది. టీడీపీ 39 శాతానికి పైగా ఓట్ల శాతాన్ని సాధించినప్పటికీ సీట్ల సంఖ్యను పొందలేక కేవలం 23 అసెంబ్లీ సీట్లతో ఆగిపోవాల్సి వచ్చింది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పార్టీ జనసేన.. ఈ పార్టీ గత ఎన్నికల్లో 6.78 శాతం ఓట్లను సాధించి ఒక సీటుకే పరిమితమైంది. టీడీపీతో కలిసి పోటీ చేస్తే పరిస్థితి వేరేలా ఉండేదంటూ పలు విశ్లేషణలు వినిపించాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ సారి కలిసి నడుస్తారా అనేదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే చంద్రబాబు మాత్రం ఇప్పటికే రెడ్ కార్పెట్ పరిచారు. కలిసి ప్రయాణం సాగిద్దామంటూ బహిరంగంగానే పిలుపునిచ్చారు.

కానీ జనసేనాని మాత్రమే కొంత బెట్టు చేస్తున్నట్టే కనిపిస్తోంది. ఒక వేళ టీడీపీ, జనసేన పార్టీ కలిసి పయనం సాగిస్తే 110 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అలా కాదు విడిగానే పోటీ చేస్తామంటే మళ్లీ వైసీపీ అధికార పీఠాన్ని తన్నుకుపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటూ టాక్.. గతంలో వచ్చినట్టు వైసీపికి 151 రాకపోయినప్పటికీ వంద స్థానాలు మాత్రం పదిలంగా ఉంచుకుంటుందని అంతా భావిస్తున్నారు. ఒక వేళ టీడీపీ, జనసేన పార్టీలో విడివిడిగా పోటీ చేస్తే ఎవరెన్ని స్థానాలు సాధిస్తారనే ఊహాగానాలూ లేకపోలేదు.. టీడీపీ 40 నుంచి 50 సీట్ల మధ్య నిలుస్తుందని, జనసేన సింగిల్ డిజిట్.కే పరిమితమవుతుందని, కాకపోతే గతంతో పోలిస్తే సేనాని ఓటింగ్ శాతం 17 నుంచి 18 శాతం వరకు పెరగవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీడీపీ మాత్రం తన 40 శాతం ఓటింగ్ భద్రంగా ఉంచుకోగా.. అలాగే అధికార వైసీపీ సైతం 40-43 మధ్య ఓటింగ్ శాతం నిలుపుకునే అవకాశం ఉంది. ఇక తాయిలాల ప్రభావం ఉండనే ఉంది..

- బంధం బలపడాల్సిందే...

ఒక వేళ టీడీపీ అధికారం చేపట్టాలంటే జనసేనాని మద్దతు తప్పకుండా ఉండాల్సిందే.. ఎందుకంటే మధ్య తరగతి ప్రజలకు కావాల్సింది రాజకీయాలు కాదు డబ్బు.. మా జేబులోకి రూపాయి వస్తుందా? లేదా అనేదే చూస్తుంటారు. అభివృద్ధి ఎలా ఉన్నా సంక్షేమ పథకాల ప్రభావం మాత్రం మధ్య తరగతి ప్రజలపై ఉందనే చెప్పాలి. తమకేమీ అందలేదనే వాళ్లు మాత్రం ఓట్లు వేయకపోయినా.. ఈ పథకాలు కావాలనుకునే మెజార్టీ ఓటర్లు మాత్రం మళ్లీ వైసీపీ వైపే వెళ్లక తప్పదు.. అందుకే ఎంతో కొంత ఓటింగ్ వృద్ధిని నమోదు చేసుకున్న సేనాని టీడీపీకి మధ్దతు తెలియజేస్తే ఇక గెలుపు నల్లేరుమీద నడకే అని చెప్పవచ్చు.. మరో ముఖ్య విషయం ఏమిటంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గంపై కాపుల ప్రభావం ఉంటుంది. అలాగని పోలవరం నియోజకవర్గంలో కాపులు ఉండరు. అక్కడ జనసేనాని పవన్ ప్రభావం జీరో... రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జన సైనికులతో పాటు తన కాపు సామాజిక వర్గం మాత్రం పవన్ వెంటే ఉంటుందని ఘంటా పథంగా చెప్పవచ్చు...



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News