ఆ ఊళ్లో సాయంకాళమే ఉండదు.. 4 అయిందంటే అంతా చీకటే!

Update: 2022-06-21 02:30 GMT
ఆ ఊళ్లో సూర్యుడు పొద్దుపొడిచే సమయానికి.. మిగతా ప్రపంచంలో మధ్యాహ్నం అవుతుంది. ఆ ఊళ్లో మధ్యాహ్నం 4 అయిందంటే చాలు చీకటి కమ్ముకుంటుంది. ప్రపంచమంతా సాయంకాలం వేళ కాస్త సేదతీరుతుంటే ఆ ఊరి ప్రజలు మాత్రం చీకట్లో ఉంటారు. ఆ ఊరి ప్రజల జీవితం చాలా వరకు చీకట్లోనే ఉంటుంది. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుందో.. దాని కథ ఏంటో తెలుసుకుందామా..?

సాధారణంగా రోజులో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి నాలుగు పూటలుంటాయి. కానీ ఆ గ్రామంలో మాత్రం ఇందులో ఒకటి మిస్ అయిపోతుంది. అదే సాయంత్రం అండీ. ఆ ఊళ్లో సాయంత్రం కనిపించదు. మధ్యాహ్నం 4 గంటలు అవ్వగానే చీకటిపడిపోతోంది. ఏళ్లతరబడి ఆ గ్రామస్థులు సాయంత్రాన్ని చూడలేదు. సాధారణంగా మిగతా ప్రదేశాల్లో సూర్యాస్తమయం అయ్యే రెండు మూడు గంటల ముందే అక్కడ చీకటి పడిపోతుంది. ఆ గ్రామం ఏ ఆప్రికా దేశంలోనో.. అంటార్కిటికా ఖండంలోనో లేదండోయ్. మన తెలంగాణలోనే ఉంది. ఆ ఊరి వింతలు విశేషాలంటో చూద్దామా మరి..

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామంలో ఇప్పటివరకు సాయంత్రం కనిపించలేదు. అందుకే ఊరిని మూడుజాముల కొదురుపాక అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ కేవలం ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పూటలు మాత్రమే ఉంటాయి. సాయంత్రం కనిపించదు. ఈ గ్రామం పచ్చటి పొలాలతో చుట్టూ పారే కానాల వాగుతో చల్లటి గాలులు, స్వచ్ఛమైన గాలి నడుమ ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.

ఈ గ్రామంలో మరో విశేషం ఏంటంటే.. ఉదయం పూట సూర్యుడు కూడా ఆలస్యంగానే దర్శనమిస్తాడు. అంటే రోజులో ఎక్కువసేపు ఇక్కడ చీకటే ఉంటుంది. సాయంత్రం 4 గంటలు దాటిందంటే చాలు.. గ్రామాల్లోని వీధి దీపాలు, ఇళ్లల్లో లైట్లు వెలుగుతుంటాయి. ఎందుకంటే అప్పటికే పూర్తిగా చీకటి పడిపోతుంది. ఆపాటికే అంతా పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకుంటారు. కొదురుపాక గ్రామ ప్రజలు సాయంత్రం సమయాన్ని చూడాలంటే పక్క ఊరికి వెళ్లాల్సిందే. ఏవరైనా కొత్త వారు గ్రామంలోకి వస్తే… ఇక్కడి పరిస్థితులు చూసి ఆశ్చర్యానికి గురవుతారు.

కొదురుపాకలో వేగంగా చీకటి పడడం వెనుక పెద్ద రహస్యం ఏంలేదు. చుట్టూ ఉన్న కొండల మధ్య ఈ గ్రామం ఉండడంతో వేగంగా చీకటి పడిపోతుంది. తూర్పున గొల్లగుట్ట, పడమరన రంగనాయకుల గుట్ట, ఉత్తరాన నంబులాద్రి గుట్ట, దక్షిణాన పాంబండ గుట్టలు ఉన్నాయి. తూర్పున ఉన్న గొల్లగుట్ట… గ్రామానికి అడ్డుగా ఉండటంతో ఇక్కడ కొంచెం ఆలస్యంగా సూర్యోదయం అవుతుంది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సూర్యుడు… గ్రామ పడమర దిక్కున ఉన్న రంగనాయకుల గుట్ట వెనక్కి వెళ్తాడు. దీంతో ఈ గ్రామాన్ని చీకటి అలుముకుంటుంది. ఇక ఆ సమయానికి ప్రతి ఇంట్లో దీపాలు వెలుగుతాయి.

సాయంత్రమే తెలియని ఈ గ్రామస్థుల జీవన విధానంగా కూడా కొంచెం భిన్నంగానే ఉంటుంది. సాధారణంగా ఉదయం ఆలస్యంగా లేచే అలవాటు ఉన్నవారు ఎవరైనా ఈ ఊరికి వస్తే మాత్రం ఇంకా ఆలస్యంగా మేలుకోవాలి.

ఎందుకంటే ఈ గ్రామంపై ఆలస్యంగా సూర్యుడి వెలుగు పడుతుంది. ఇక తెల్లారిందా పనులు త్వరత్వరగా పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే త్వరగా చీకటి పడుతుంది కాబట్టి. మరోవైపు ఇక్కడి నుండి ఇతర ప్రాంతాలకు పని కోసం వెళ్లిన వారు కూడా చీకటి భయంతో వీలైనంత త్వరగా ఊరికి వచ్చే ప్రయత్నం చేస్తుంటారు.
Tags:    

Similar News