నార్వే మహిళను భారత్ నుంచి పంపేశారు

Update: 2019-12-27 13:04 GMT
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనల్ని నిర్వహించటం తెలిసిందే. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నిరసనలు.. ఆందోళనలు సాగుతున్న వేళ ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. నార్వే దేశానికి చెందిన ఒక మాజీ నర్సు భారత్ ను చూసేందుకు టూరిస్టు వీసా మీద వచ్చారు. 74 ఏళ్ల ఆమె పేరు జాన్నె మెట్టె జాన్సన్. డిసెంబరు 17న భారత్ కు వచ్చిన ఆమె తన పర్యటనలో భాగంగా కేరళ రాష్ట్రంలోని కొచ్చికి వచ్చారు.

అక్కడి స్థానికులు సీఏఏకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. వారి నిరసనకు కారణం తెలుసుకున్న ఆమె.. తాను కూడా ఆందోళనల్లో పాల్గొన్నారు. అంతేకాదు.. తాను పాల్గొన్న నిరననలకు సంబంధించిన అనుభవాల్ని ఫేస్ బుక్ లో వెల్లడించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని అందుకున్న అధికారులు ఆమె ఫేస్ బుక్ ఖాతాను చెక్ చేశారు. అందులో అరుంధతీరాయ్ చేసిన వ్యాఖ్యల్ని షేర్ చేయటంతో పాటు సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా ఆమె చేసిన వ్యాఖ్యల్ని గుర్తించారు.

దీంతో వీసా నిబంధనల్ని ఉల్లంఘించిన ఆమెను వెంటనే దేశం నుంచి విడిచి పెట్టి వెళ్లాల్సింది అధికారులు ఆదేశాలు జారీ చేశారు. లేని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీనిపై సదరు మహిళ మాట్లాడుతూ.. అధికారులు చెప్పేదంతా నిజమేనని.. తాను భారత్ ను విడిచి పెట్టి వెళ్లేందుకు సిద్ధమైనా అధికారులు మాత్రం తిరిగి వెళ్లే విమాన టికెట్టును చూపే వరకూ వదల్లేదని పేర్కొంది. రిటర్న్ టికెట్ చూపించిన తర్వాతే వారు ఏరుకున్నారని చెప్పారు. ఇలాంటి ఉదంతమే మద్రాస్ ఐఐటీలో ఒక జర్మన్ విద్యార్థి కూడా నిరసనల్లో పాల్గొనటం.. అధికారుల ఆదేశాలతో దేశం విడిచి పెట్టి వెళ్లటం తెలిసిందే.
Tags:    

Similar News