ఏపీలో కొత్త జిల్లాలు.. బాలయ్య కోరిక ఇది

Update: 2019-06-29 07:15 GMT
ఏపీలో కొత్త జిల్లాలపై వైసీపీ నేతలే కాదు తెలుగుదేశం పార్టీ నేతల నుంచీ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు బావమరిది కమ్ వియ్యంకుడైన హీరో నందమూరి బాలకృష్ణ కూడా తన నియోజకవర్గ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని కోరుతున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య హిందూపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొన్న వైసీపీ హవాలో రాయలసీమలో కేవలం ముగ్గురే టీడీపీ నుంచి గెలవగా అందులో బాలయ్య ఒకరు.

బాలయ్య ప్రస్తుతం తన నియోజకవర్గంలో మూడు రోజులుగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కూడా.  ఈ సందర్భంగా స్ధానికంగా ఉన్న సమస్యల్ని అడిగితెలుసుకుంటూ చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు రాయలసీమ అభివృద్దికి పాటు పడతానని ఆయన హామీ ఇచ్చారు. హిందూపురంను జిల్లా చేయాలన్న బాలయ్య.. ఈ మేరకు సీఎం జగన్‌ను కలిసి ఈ విషయం ఆయన దృష్టికి తీసుకెళ్తానన్నారు.

హిందూపురం నుంచి రెండో సారి గెలిచిన బాలయ్య తన పర్యటనలో ఓటర్లు కృతజ్ఞతలు కూడా చెబుతున్నారు. ఈసారి రాయలసీమలో చంద్రబాబు- పయ్యావుల కేశవ్- బాలయ్య మాత్రమే గెలిచారు. నిత్యం ప్రజలలో ఉండి.. రాజకీయాల్లో ఆరితేరిపోయిన నేతలు కూడా ఓడిపోయిన సమయంలో బాలయ్య గెలవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. బాలయ్య గత టెర్ములో నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నప్పటికీ కూడా రెండోసారి విజయం సాధించగలిగారు. దీంతో బాలయ్య వైఖరిలోనూ మార్పు వచ్చిందని.. అందుకే.. హిందూపురం అభివృద్ధి, జిల్లా డిమాండ్లతో జగన్‌ ను కలవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. బాలయ్యను తీవ్రంగా విమర్శించే బ్యాచ్ మాత్రం దీనిపైనా విమర్శలు చేస్తున్నారు. సొంత బావ అయిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు చేయని డిమాండ్ ఈ కొత్త ప్రభుత్వం ముందు బాలయ్య వినిపిస్తున్నారని... గత అయిదేళ్లు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News