తిరుప‌తి వైసీపీ ఎమ్మెల్యేల‌కు డ‌బ్బు త‌ల‌నొప్పి అయ్యిందే ?

Update: 2021-04-06 17:30 GMT
ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వ‌చ్చిన‌ట్టుగా ఉంది తిరుప‌తి పార్ల‌మెంటు ప‌రిధిలో ఉన్న అధికార వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ప‌రిస్థితి. తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పెట్టిన టార్గెట్ గెలుపు కాదు... 3 ల‌క్ష‌ల మెజార్టీ. ఈ మెజార్టీతో తిరుప‌తి సీటును గెలిచి రావాల‌న్న‌దే జ‌గ‌న్ మంత్రులు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ఎమ్మెల్యేల‌కు పెట్టిన కండీష‌న్. అయితే తిరుప‌తి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేల‌ది మ‌రో క‌ష్టం. ఈ పార్ల‌మెంటు ప‌రిధిలో అన్ని చోట్లా వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా బ‌ల‌మైన నేత‌లే. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో పార్టీ భారీగా ఖ‌ర్చు చేస్తోంది. ఇందుకు సంబంధించి స‌గానికిపైగా ఖ‌ర్చు ఎమ్మెల్యేల ఖాతాల్లో వేసేస్తున్నార‌ట‌.

ఎన్నిక‌ల‌కు ముందు రోజు ఓట‌ర్ల‌కు పంచే డ‌బ్బులో కొంత వ‌ర‌కు అధిష్టానం స‌ర్దుబాటు చేసినా ... అప్ప‌టి వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం నుంచి మొద‌లుకుని... త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇన్‌చార్జ్‌లుగా వ‌చ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇత‌ర రాష్ట్ర స్థాయి నేత‌ల‌కు స‌క‌ల సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు అవుతోన్న బిల్లులు త‌డిసి మోపెడు అవుతున్నాయ‌ట‌. ఇవ‌న్నీ కూడా స్థానికంగా ఎమ్మెల్యేల ఖాతాల్లోనే వేసేస్తున్నార‌ట‌. ఇందుకోసం అధిష్టానం నుంచి చిల్లిగ‌వ్వ కూడా రావ‌డం లేదంటున్నారు. దీంతో పార్ల‌మెంటు ప‌రిధిలోని ఎమ్మెల్యేలు అస‌లే త‌మ‌కే నిధులు లేక ఇబ్బంది ప‌డుతుంటే.. ఇప్పుడు ఈ ఖ‌ర్చులో స‌గం మా ఖాతాలో వేయ‌డం ఏంట్రా బాబు అని క‌క్క‌లేక మింగ‌లేక ర‌గులుతున్నారు.

దీనికి తోడు ఈ పార్ల‌మెంటు ప‌రిధిలో ఒక‌రిద్ద‌రు ఎమ్మెల్యేలు త‌ప్పా ఎవ్వ‌రూ జ‌గ‌న్ / అధిష్టానంపై సంతృప్తిగా లేరు. కొంద‌రు ముందు నుంచి గుస్సాతో ఉంటే.. కొంద‌రు ఇటీవ‌ల జ‌రిగిన కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో త‌మ సూచ‌న‌లు ప‌ట్టించుకోలేద‌ని ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇలాంటి టైంలో ఇప్పుడు వీరి నెత్తిన డ‌బ్బు గుదిబండ వేయ‌డంతో మేం ఖ‌ర్చు పెట్ట‌లేమని చెప్ప‌నూ లేరు.. అటు ఖ‌ర్చు చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. విచిత్రం ఏంటంటే ఈ ఉప ఎన్నిక‌ల్లో భారీ మెజార్టీ టార్గెట్‌గా పెట్టిన జ‌గ‌న్ ఆ స్థాయిలో అయితే పై నుంచి డ‌బ్బులు విద‌ల్చ‌డం లేద‌న్న కంప్లైంట్ కూడా పార్టీ వ‌ర్గాల్లోనే ఉంది.

ఇటీవ‌ల స‌ర్పంచ్‌, కార్పోరేష‌న్‌, మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రెస్టేజ్ కోసం విప‌రీతంగా డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టారు. ఇక జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు వైజాగ్‌, విజ‌య‌వాడ‌, గుంటూరు లాంటి చోట్ల‌కు అధిష్టాన‌మే స్వ‌యంగా డ‌బ్బులు పంచింద‌న్న‌ది కూడా వాస్త‌వం. ఇప్పుడు ఏకంగా ఓ పార్ల‌మెంటు స్థానానికి ఉప ఎన్నిక‌.. పైగా భారీ మెజార్టీ టార్గెట్‌... ఈ లెక్క‌న అధిష్టానం ఇంకెంత ఖ‌ర్చు పెట్టాలి. జ‌గ‌న్ మాత్రం మ‌నం అమ‌లు చేస్తోన్న సంక్షేమ ప‌థ‌కాలే మ‌న‌కు తిరుగులేని మెజార్టీ ర‌ప్పిస్తాయ‌ని చెపుతున్నా అందుకు త‌గ్గ‌ట్టుగా ఖ‌ర్చు చేయ‌డం లేద‌ని అక్క‌డ ఎమ్మెల్యేలు వాపోతున్నారు.

పైగా పార్ల‌మెంటు ప‌రిధిలో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేల‌కు డ‌బ్బు టార్గెట్ పెట్ట‌డంతో పాటు మీ నియోజ‌క‌వ‌ర్గాల నుంచి గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇంత మెజార్టీ వ‌చ్చింది... ఇప్పుడు ఇంత మెజార్టీ రావాల‌ని కూడా పార్టీ అధినేతే స్వ‌యంగా టార్గెట్లు పెడుతుండ‌డంతో వారు ఈ మండుటెండ‌ల‌కు ఏమోగాని.. ఈ టార్గెట్ల‌కు బెంబేలెత్తుతున్నారు. ఏదేమైనా తిరుప‌తి ఉప ఎన్నిక ఈ ఏడుగురు ఎమ్మెల్యేల‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారింద‌న్న‌ది నిజం.
Tags:    

Similar News