స‌భ‌లో త‌లాక్ చ‌ర్చ వేళ‌..గులాబీ ఎంపీల ఫీట్‌

Update: 2017-12-29 06:10 GMT
విష‌యం ఏదైనా స‌రే.. త‌న‌దైన కోణంలో చెప్పేస్తుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. త‌ప్పా.. ఒప్పా అన్న‌ది ప‌ట్టించుకోకుండా త‌న స్టాండ్ ఇదేన‌ని తేల్చేశారు. మ‌రి.. అలాంటి కేసీఆర్ స‌ర్కారు తాజాగా లోక్ స‌భ‌లో ప్ర‌వేశ పెట్టిన త‌క్ష‌ణ త‌లాక్ పై శిక్ష విధించే బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా వ్య‌వ‌హ‌రించిన తీరు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మార‌ట‌మే కాదు.. కేసీఆర్ తీరును త‌ప్పు ప‌ట్టేలా చేస్తోంది.

ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. కీల‌క‌మైన ట్రిపుల్ త‌లాక్ పై త‌న తీరును స్ప‌ష్టంగా చెప్పే ప్ర‌య‌త్నం చేయ‌కుండా అనుస‌రించిన వైనంపై ఇప్పుడు విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. దేశ‌మంతా చ‌ర్చ జ‌రుగుతున్న ఒక అంశంపై కేసీఆర్ స‌ర్కారు అనుస‌రిస్తున్న వైఖ‌రి ఏమిట‌న్న విష‌యంపై అర్థం కాని రీతిలో వ్య‌వ‌హ‌రించ‌టాన్ని త‌ప్పు ప‌డుతున్నారు.

గురువారం హాట్ హాట్ గా ట్రిపుల్ త‌లాక్ చ‌ర్చ లోక్ స‌భ‌లో జ‌రుగుతున్న వేళ‌.. బీజేపీ ఈ బిల్లును పూర్తిగా స‌మ‌ర్థిస్తే.. కాంగ్రెస్ పార్టీ అటు స‌మ‌ర్థించ‌లేక‌.. ఇటు వ్య‌తిరేకించ లేక కామ్ గా ఉండిపోయింది. ఏదో నాలుగు మాటలు మాట్లాడి మ‌ధ్యే మార్గంగా ఈ బిల్లును స్టాండింగ్ క‌మిటీకి పంపి.. మ‌రింత అధ్య‌య‌నం చేయాలని కోరింది.

ఇక‌.. ఓవైసీ మ‌జ్లిస్ గ‌ట్టిగా త‌ప్పు ప‌ట్టింది. ఇక‌.. బీజేడీ.. ఎడీఎంకే.. ఎస్పీ వంటి పార్టీలు త‌లాక్ బిల్లును వ్య‌తిరేకించాయి. ఇదిలా ఉంటే.. త‌లాక్ బిల్లుపై చ‌ర్చ జ‌రుగుతున్న వేళ‌.. టీఆర్ ఎస్ ఎంపీలు అంద‌రూ ఒక్క‌సారిగా లేచి.. స‌భ నుంచి వెళ్లిపోయారు. అలా వెళ్లినోళ్లు బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా లాబీల్లో నుంచి చూస్తూ ఉండిపోయారు.

ఎందుకిలా అంటే.. త‌మ‌ది త‌ట‌స్థ వైఖ‌రి అని.. అందుకే అలా వ్య‌వ‌హ‌రించామ‌ని చెబుతున్నారు. బిల్లు ఆమోదం పొంద‌గానే స‌భ‌లోకి వ‌చ్చి కూర్చోవ‌టం చూసిన‌ప్పుడు ఈ బిల్లుపై టీఆర్ ఎస్ స్టాండ్ ఏమిట‌న్న అయోమ‌యం ముంచెత్త‌క మాన‌దు. ముస్లింల‌కు 12 శాతం రిజ‌ర్వేష‌న్ల కోసం సుప్రీంలో కోట్లాడ‌తామ‌ని గొప్ప‌లు చెప్పే పార్టీ.. త‌లాక్ పై క‌న్ఫ్యూజ‌న్‌ కు గుర‌య్యేలా వ్య‌వ‌హ‌రించ‌టం ఏమిటి? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

త‌లాక్ బిల్లును స‌మ‌ర్థిస్తే ముస్లింల వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకుంటుంద‌న్న సందేహంలో ఉందా? ఒక‌వేళ త‌లాక్ బిల్లును స‌మ‌ర్థిస్తే.. మ‌జ్లిస్ అధినేత‌తో త‌గులాట జ‌రుగుతుంద‌న్న ఉద్దేశంతో ఇలా చిత్ర‌మైన రీతిలో వ్య‌వ‌హ‌రించిందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. వాస్త‌వానికి త‌లాక్ బిల్లుపై త‌న స్టాండ్ ను స్ప‌ష్టం చేయ‌టం ఇబ్బంది అనుకుంటే.. ఈ బిల్లులో ఉన్న ఇబ్బందిక‌ర అంశాల్ని ప్ర‌స్తావించి.. వాటిని తీసి వేసే ప్ర‌య‌త్నం చేస్తే బాగుండేది. ప్ర‌తి విష‌యానికి సింపుల్ గా సొల్యూష‌న్ చెప్పే అల‌వాటున్న కేసీఆర్‌ కు.. ట్రిపుల్ త‌లాక్ ముచ్చ‌ట మీద మాత్రం మాట మాట్లాడ‌కుండా కామ్ గా లోక్ స‌భ బ‌య‌ట‌కు వెళ్లిపోవ‌టం ఏమిట‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.  కీల‌క‌మైన అంశంపై ఇలా వ్య‌వ‌హ‌రించ‌టం స‌రికాద‌న్న అభిప్రాయం ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.
Tags:    

Similar News