టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలు ... నోరూరించే ఫుడ్ ఐటమ్స్, మెనూ ఇదే

Update: 2021-10-25 06:12 GMT
టీఆర్ ఎస్ ప్లీనరీతో పాటు ఆ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా 20 ఏళ్ల క్రితం టీఆర్ ఎస్ ఏర్పాటైంది.2014 జూన్ 2న తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. కొత్త రాష్ట్రానికి కేసీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఏడేండ్లుగా కేసీఆర్ తెలంగాణ సీఎంగా కొనసాగుతున్నారు. మూడేళ్ల తరువాత తొలిసారిగా ఈ ప్లీనరీని నిర్వహిస్తోంది టీఆర్ఎస్. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ఆ లోటును తీర్చేలా అత్యంత వైభవంగా పార్టీ ప్లీనరీని నిర్వహించడానికి ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది.

మాదాపూర్‌ హెటెక్స్‌ లో దీనికి వేదికగా మారింది. అన్ని నియోజకవర్గాల నుంచి ఆరు వేల మంది ప్రతినిధులను ఆహ్వానించారు. టి ఆర్ ఎస్ 2023 నాటి ఎన్నికల్లోనూ విజయదుందుభిని మోగించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. హ్యాట్రిక్ విజయాలను అందుకోవడానికి ఉవ్విళ్లూరుతోంది. ఉద్యమసారథిగా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మరోసారి పార్టీ అధినేతగా పగ్గాలను స్వీకరించడం లాంఛనమే. అధ్యక్షుడి ఎన్నిక కోసం ఎన్నికలను నిర్వహించింది పార్టీ. నామినేషన్లను దాఖలు చేసుకునే అవకాశాన్ని కల్పంచింది. ఈ పదవికి కేసీఆర్ ఒక్కరే నామినేషన్ వేశారు.

ఆయనను బలపరుస్తూ, మంత్రులు, ఇతర పార్టీ నాయకులు దరఖాస్తులను దాఖలు చేశారు. మరొకరు పోటీలో లేకపోవడం వల్ల కేసీఆర్ ఎన్నిక ఇక ఏకగ్రీవమే. ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధుల కోసం పార్టీ అగ్ర నాయకత్వం పసందైన వంటకాలను సిద్ధం చేసింది. మాంసాహార భోజనానికి ప్రాధాన్యత ఇచ్చింది. ప్లీనరీ ప్రాంగణం- తెలంగాణ సంప్రదాయబద్ధమైన వంటకాల ఘుమఘుమలతో అదిరిపోతోంది. మొత్తంగా 29 రకాల వంటకాలను పార్టీ నాయకత్వం సిద్ధం చేసింది. ఒకేసారి ఆరువేల మంది భోజనం చేసేలా ఏర్పాట్లను పూర్తి చేసింది. వీవీఐపీలతో పాటు ప్రజాప్రతినిధులు, మహిళలకు వేర్వేరుగా భోజన శాలలు ఉంటాయి.

టీఆర్ ఎస్ ప్లీనరీలో రుమాలీ రోటి, నాటుకోడి పులుసు, పాయా సూప్‌, ధమ్‌ చికెన్‌ బిర్యానీ, మటన్ బిర్యానీ, మటన్‌ కర్రీ, బోటి ఫ్రై, ఎగ్‌ మసాలా అందుబాటులో ఉంటాయి. శాకాహారుల కోసం బగారా రైస్‌, బటర్‌ రైస్‌, దాల్‌ రైస్‌, కర్డ్ రైస్, వెజ్‌ బిర్యానీ, వైట్‌ రైస్‌, ఆలూ క్యాప్సికం మిక్స్డ్ వెజిటబుల్ కూర, గుత్తి వంకాయ కూర, వంకాయ చట్నీ, టమోటా చట్నీ, బెండకాయ కాజు ఫ్రై, పాలకూర మామిడికాయ పప్పు, పచ్చి పులుసు, ముద్ద పప్పు, సాంబారు, ఉలవచారు, పెరుగు, అవకాయను భోజనంలో వడ్డించనున్నారు. కాగా- ప్లీనరీకి వెళ్లే మార్గాలన్నీ గులాబీమయం అయ్యాయి. బ్యానర్లు, జెండాలతో నింపేశారు. ప్రధాన కూడళ్లలో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. కేసీఆర్, కేటీఆర్‌, కల్వంకుట్ల కవిత, తన్నీరు హరీష్ రావు.. ఫ్లెక్సీలు ప్రధానంగా కనిపిస్తోన్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి అభిమానులు, అనుచరుల పేర్ల మీద ప్లెక్సీలు, కటౌట్‌లు హైదరాబాద్‌ లో ఎటు చూసినా కనిపిస్తోన్నాయి


Tags:    

Similar News