మ‌హంకాళి అమ్మ అగ్ర‌హంగా ఉందా?

Update: 2015-08-03 09:01 GMT
ఉజ్జ‌యిని మ‌హాంకాళి అమ్మ‌కు కోపం వ‌చ్చిందా? ఆమె తీవ్ర ఆగ్ర‌హంగా ఉందా? బోనాల సంద‌ర్భంగా  ఆల‌యంలో ద‌గ్గ‌ర రంగం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా స్వ‌ర్ణ‌ల‌త అమ్మ‌వారి ఒంటి మీద‌కు వ‌చ్చి భ‌విష్య వాణి ప‌లుకుతార‌ని ప్ర‌తీతి. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. రెండోసారి భ‌విష్య వాణి చెప్ప‌టంతో కాస్త ఆస‌క్తి నెల‌కొంది.

అయితే.. అంద‌రి ఊహాల్ని త‌ల‌కిందులు చేస్తూ.. ఆమ్మ తీవ్ర ఆగ్ర‌హంతో ప‌లు అంశాల్ని ప్ర‌స్తావించ‌టం సంచ‌ల‌నంగా మారింది. ఎవ‌రికి వారు రాష్ట్రాన్ని దోచుకుంటున్నార‌ని.. చివ‌ర‌కు ఆల‌యానికి కేటాయించిన నిధులు కూడా మింగేస్తున్నారంటూ మండిప‌డింది. దుష్టులు తమ ప్ర‌వ‌ర్త‌న‌ను మార్చుకోవాల‌ని.. నాయ‌కులు స్వార్థప‌రులుగా మారితే మంచి ఎలా జ‌రుగుతుంద‌ని ప్ర‌శ్నించారు.

పాపాలు పెరుగుతుంటే వ‌ర్షాలు ఎలా కురుస్తాయ‌ని ప్ర‌శ్నించిన ఆమె.. నాయ‌కుల్లో సేవా భావం పెర‌గాల‌ని సూచించారు. తన‌ను న‌మ్మిన భ‌క్తుల‌కు అండ‌గా ఉంటాన‌న్న భ‌విష్య‌వాణి.. ఆల‌య‌సిబ్బంది.. అధికారులు.. పోలీసులు ఇంత‌మంది ఉన్నా.. త‌న భ‌క్తులు త‌న ద‌గ్గ‌ర‌కు రావ‌టానికి ఇన్ని క‌ష్టాలు ప‌డాలా? అని తీవ్ర‌స్వ‌రంతో ప్ర‌శ్నించారు.

త‌న‌కు ఏ ర‌క‌మైన సేవ‌లు సంతృప్తిక‌రంగా జ‌ర‌గ‌టం లేద‌ని వ్యాఖ్యానించ‌టంతో గుడి ప్ర‌ధాన పూజారి క‌లుగ‌జేసుకొని.. ఆల‌యంలో చేస్తున్న సేవ‌ల గురించి వివ‌రంగా చెప్పుకొచ్చారు. ప్ర‌జ‌ల‌ను కాపాడాల్సిన నువ్వే ఇలా మాట్లాడితే ఎలా అన్న ప్ర‌ధాన పూజారి మాట‌ల‌కు.. స్పందించిన అమ్మ ర‌క్షించేది.. శిక్షించేది..క‌ష్టాలనుతీర్చేది తానేన‌ని వ్యాఖ్యానించారు. అమ్మ అగ్ర‌హం అక్క‌డి భ‌క్తుల్లో ఆందోళ‌న‌ను పెంచింది. అమ్మ అగ్ర‌హాన్ని త‌గ్గించేందుకు పూజారులు పెద్ద ఎత్తున శ్ర‌మించాల్సి వ‌చ్చింది.
Tags:    

Similar News