చంద్రబాబు.. పోలింగ్ అయిపోయింది - నిజం చెప్పండి: ఉండవల్లి

Update: 2019-05-07 07:36 GMT
తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి  తీరును సునిశితంగా విమర్శించారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. 'ఎన్నికల పోలింగ్ అయిపోయాయింది. కనీసం ఇప్పుడైనా నిజాలు చెప్పండి చంద్రబాబు నాయుడు..' అని ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరులో వివిధ అంశాలపై ఉండవల్లి స్పందించారు.

పోలవరం పై చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్షపై ఉండవల్లి స్పందించిన తీరు ఆసక్తిదాయకంగా ఉంది. 'పోలవరం అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉంది. ఆ విషయాన్ని అధికారులే నాకు చెబుతూ ఉన్నారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు నిజాలు చెప్పాలి. ఈ ఏడాది జూన్ లోనే నీళ్లను అందిస్తామని ఇది వరకూ ప్రకటించారు. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు వచ్చే ఏడాది నీళ్లు అంటున్నారు. అప్పటికైనా ఎలా అందిస్తారు? ఒకవైపు పనులు మాత్రమే అయ్యాయి. మరోవైపు పనులు జరగడం లేదు.

అలాంటిది వచ్చే  ఏడాదికి అయినా నీళ్లు అందించడం ఎలా సాధ్యం అవుతుంది? ఒకవైపు పోలవరం ప్రాంతంలో పగుళ్లు ఏర్పడుతూ ఉన్నాయి. ఆ అంశం గురించి పట్టించుకోవడం లేదు. ఇదే అత్యంత ప్రమాదకరమైన అంశం. రేపు జరగరానిది జరిగితే రాజమండ్రి మొత్తం మునిగిపోతుంది. కొన్ని వందల ఊర్లు నామరూపాలు లేకుండా పోతాయి. ముంపు ప్రాంతం ఎంత? ముంపు ప్రాంతానికి ప్యాకేజీ ఇవ్వాలంటే ముప్పై వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి. అంత డబ్బును ఎక్కడ నుంచి తెస్తారు?

పోలవరం ప్రాజెక్టు సందర్శనకు అంటూ ఎంతో మందిని తీసుకెళ్లి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అక్కడకు నన్ను తీసుకెళ్లి సందేహాలను నివృత్తి చేయమని అడుగుతుంటే ఎవ్వరూ ముందుకు రావడం లేదు నేను లేవనెత్తిన అంశాల్లో ఏమైనా తప్పుంటే క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాను..' అని ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.

ఇక పోలింగ్ అనంతరం చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై కూడా అరుణ్ కుమార్ స్పందించారు. 'పోలింగ్ జరుగుతూ ఉండగా ఓటు ఎవరికి పడిందో తెలియడం లేదంటూ ఏ ముఖ్యమంత్రి కూడా ప్రకటించలేదు. చంద్రబాబు నాయుడు అలా చేశారు. ఈవీఎంలు కొత్తవి ఏమీకావు. వాటితో చంద్రబాబు నాయుడు రెండు సార్లు ఓడారు, ఒకసారి గెలిచారు. అలాంటప్పుడు ఈవీఎంల మీద అభ్యంతరాలు అర్థం లేనివి.

వీవీ ప్యాట్ లను శాంపిల్స్ గా లెక్కించనున్నారు కదా. అలాంటప్పుడు కౌంటింగ్ జరగకముందే చంద్రబాబు నాయుడు ఇలా ఎలా మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు ఇరిటేషన్ ను తగ్గించుకోవాలి. సీఎస్ మీద కూడా చంద్రబాబు నాయుడు అర్థం లేని ఆశేశాన్ని చూపిస్తూ ఉన్నారు. బాబు కావాలనుకుంటే జగన్ నో  - మోడీనో విమర్శించుకోవచ్చు. సీఎస్ ను విమర్శించడం ఏమిటి? లేని వివాదాలను క్రియేట్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు..' అని చంద్రబాబుకు హితవు పలికారు ఉండవల్లి  అరుణ్ కుమార్.


Tags:    

Similar News