కేసీఆర్ ఓటమి లెక్కలు చెప్పుకొచ్చాడు

Update: 2016-06-12 04:20 GMT
ఎవరైనా ఏదైనా చెబితే విని ఊరుకునే రోజులు పోయి చాలా కాలమే అయ్యింది. గొప్పలు చెప్పుకుంటే వాస్తవాల వాతలు పెట్టటానికి సిద్ధంగా ఉన్నారిప్పుడంతా. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బడాయి మాటలు చెప్పటం తెలిసిందే. తనకు ఓటమి అన్నది తెలీదంటూ ఆయన చెప్పిన మాటకు కౌంటర్ అటాక్ మొదలైంది. టీటీడీపీ అధికార ప్రతినిధి వంటేరు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ.. ఓటమి అంటూ తెలీదని చెప్పిన కేసీఆర్ ఓటమి లెక్కల్నివరుసగా చెప్పుకొచ్చారు.

1983లో సిద్దిపేటలో కాంగ్రెస్ నేత మదన్ మోహన్ మీద కేసీఆర్ ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేయటమే కాదు.. అలాంటివి మర్చిపోయారా? అంటూ ప్రశ్నించారు కూడా. ఇక.. 2004లో కాంగ్రెస్ తో జత కట్టి 57 సీట్లలో పోటీ చేస్తే 26 సీట్లు మాత్రమే గెలిచారని.. 2009లో టీడీపీతో జత కట్టి 52సీట్లలో పోటీ చేస్తే పది సీట్లలో మాత్రమే విజయం సాదించిన విషయాల్ని గుర్తుచేసిన ఆయన.. ‘‘ఇవన్నీ విజయాలేనా?’’ అంటూ సూటిగా ప్రశ్నించారు.

బడాయి మాటలు వీలైనంత తక్కువగా చెప్పుకుంటే ఉండేంత సుబ్బరం మరొకటి ఉండదు. కానీ.. ఆ విషయాన్ని వదిలేసిన కేసీఆర్ అప్పుడప్పుడు తనకు సంబంధించిన గొప్పలు చెబుతుంటారు. కానీ.. చరిత్రే చిరాకు తెప్పించేలా ఉంటుందన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకుంటే ఆయన నోటి నుంచి వచ్చే మాటలు వేరేలా ఉండొచ్చు. ఎవరూ విమర్శించేందుకు ధైర్యం చేయలేకపోతున్న టైంలో.. మాట అనిపించుకునే అవకాశం ఇవ్వటం ఎంతవరకు సబబు కేసీఆర్ సార్..?
Tags:    

Similar News