డీఎస్ తీరు.. వెంకయ్యకు మరో పరీక్ష!

Update: 2019-07-13 06:05 GMT
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ డీఎస్ మీద ఫిర్యాదు చేయాలని అనుకుంటోందట తెలంగాణ రాష్ట్ర సమితి. గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానంపై డీఎస్ అసంతృప్తితో ఉన్నారనే విషయం స్పష్టం అవుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆయన పార్టీ మారేందుకు రెడీ అయ్యారని వార్తలు వచ్చాయి. అది కూడా తన పాత పార్టీ కాంగ్రెస్ లోకి చేరడబోతున్నాడని  అప్పట్లో ఆయన విషయంలో పుకార్లు వినిపించాయి. అయితే అప్పుడు పిరాయించలేదు డీఎస్.

ఇక తెలంగాణ అసెంబ్లీఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాధించడంతో కొన్నాళ్లు డీఎస్ కామ్ అయిపోయారు. కానీ లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున డీఎస్ తనయుడు ఘన విజయం సాధించారు. దీంతో డీఎస్ తీరులో మళ్లీ మార్పు కనిపిస్తూ ఉంది. ఆయన భారతీయ జనతా పార్టీ వైపు  మళ్లుతున్నారనే దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి.

ఇటీవలే తన తనయుడి అభినందన సభకు హాజరయ్యారు డీఎస్. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న ఆయన తాజాగా అమిత్ షాతో  కూడా సమావేశం అయ్యారు. తద్వారా బీజేపీకి మరింత దగ్గరయ్యారు.

ప్రస్తుతం రాజ్యసభలో తమ బలాన్ని  మరింత పెంచుకునే ప్రయత్నంలో ఉంది బీజేపీ. అందులో భాగంగా డీఎస్ ను కూడా చేర్చుకున్నా చేర్చుకోవచ్చు. ఈ లోపే ఆయనపై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అనే అభియోగంతో ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతోందట టీఆర్ ఎస్. మరి ఈ విషయంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య ఎలా వ్యవహరిస్తారు? డీఎస్ పై అనర్హత వేటు వేయగలరా? లేక ఆయన బీజేపీ వైపు చూస్తున్నారు కాబట్టి.. అనర్హత ఉండదంటారా?
Tags:    

Similar News