బాబు - రవిప్రకాశ్...ఇద్దరిదీ ఒకే రూటు

Update: 2019-05-18 13:57 GMT
టీడీపీ అధినేత - ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అంటేనే తనదైన శైలిలో పంచ్ లు విసురుతున్న వైసీపీ ప్రధాన కార్యదర్శి - ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి... టీవీ9 రవిప్రకాశ్ వివాదం నేపథ్యంలో మరోమారు తనదైన శైలి పవర్ ఫుల్ పంచ్ లు సంధించారు. టీవీ 9 వ్యవస్థాపకుడిగా ఉన్న రవిప్రకాశ్... ఆ ఛానెల్ లో కొత్త యాజమాన్యం బాధ్యత స్వీకరణకు తనవంతు ఆటంకాలు సృష్టించిన వైనం పెను వివాదానికే దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రవిప్రకాశ్ ను అలంద మీడియా దాదాపుగా మెడబట్టి గెంటేసినంత పనిచేసింది. అంతేకాకుండా ఆయనపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఈ క్రమంలో టీవీ 9 లోగోలను కూడా రవిప్రకాశ్ తన సొంత మీడియా ఛానెల్ మోజోటీవీకి రూ.99వేలకు విక్రయించిన వైనం కూడా బయటపడింది.

ఈ నేపథ్యంలో కాసేపటి క్రితం ట్విట్టర్ లో ఎంట్రీ ఇచ్చిన విజయసాయిరెడ్డి... రవిప్రకాశ్ వ్యవహారాన్ని చంద్రబాబు వ్యవహారంతో పోల్చారు. టీవీ 9 లోగోలను రవిప్రకాశ్ తన బినామీలకు లక్ష రూపాయలకే విక్రయించారని ఆరోపించిన విజయసాయిరెడ్డి... రవిప్రకాశ్ మాదిరే చంద్రబాబు కూడా అమరావతి నిర్మాణం కోసం రైతులు ఇచ్చిన భూములను సింగపూర్ కు అమ్మేశాడు అంటూ సెటైర్ సంధించారు. ఈ సందర్బంగా ఓ డయాగ్రమ్ ను కూడా పోస్ట్ చేసిన విజయసాయిరెడ్డి.... అందులో పై భాగంలో రవిప్రకాశ్ టీవీ9 లోగోలను అమ్మిన వార్తను - ఆయన ఫొటోను వేసి... కింది భాగంలో చంద్రబాబుతో సింగపూర్ మంత్రి కలిసి కూర్చున్న చిత్రాన్ని వేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.

ఇక రవిప్రకాశ్ లోగోలను అమ్మేసిన వైనాన్ని తనదైన శైలిలో ప్రస్తావించిన విజయసాయిరెడ్డి... ‘క్రీ.శ.193లో రోమన్ చక్రవర్తి పెర్టినాక్స్ ను అతని సైన్యమే హతమార్చి సామ్రాజ్యాన్ని వేలంలో అమ్మేశారట. రవిప్రకాశ్ దాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చాడు. టీవీ9 లోగోలను రూ.99 వేలకు తన మోజో టీవీకే విక్రయించి కార్పొరేట్ రంగాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాడు. వామ్మో... రవిప్రకాశూ నువ్వు మామూలోడివి కాదు‘ అంటూ తనదైన సెటైర్ సంధించారు. ఇక ఆ తర్వాత రవిప్రకాశ్ తో పాటు ఈ వ్యవహారంలో అడ్డంగా బుక్కైన సినీ నటుడు శివాజీని కూడా విజయసాయిరెడ్డి  ఆటాడుకున్నారనే చెప్పాలి. ‘బ్రోకర్ శివాజీని పట్టుకుని పోలీసులు తమ స్టైల్ లో ప్రశ్నిస్తే గరుడ పురాణం స్క్రిప్ట్  ఎవరిచ్చారో కక్కేస్తాడు. అది మీడియా ‘నయీం‘ పనే అని తేలుతుంది. ఈ నేరాలు విచారించాలంటే స్పెషల్ కోర్టులు కావాలి. 25 ఏళ్ల క్రితం వేయి జీతానికి పనిచేసినోడు వందల కోట్లు ఎలా  పోగేశాడో తేల్చాలి‘ అంటూ శివాజీపై తనదైన పంచ్ వేశారు.
Tags:    

Similar News