వైరల్: తెలంగాణ మంత్రులు షేర్ చేసుకుందేంటి?

Update: 2021-07-16 15:30 GMT
ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా మన అలవాట్లు మాత్రం మారవన్నది నిజం. పుట్టుకతోనే వచ్చిన బుద్ది పుర్రె కాలేవరకు పోదంటారు. అది నిజమో కాబోలు.. అలవాట్లు లేని మనిషి ఉండరు. కొందరు బీర్లు, విస్కీ తాగడం హాబీగా పెట్టుకుంటారు. కొందరికి సిగరెట్ అలవాటు ఉంటుంది. మరికొందరికి అమ్మాయిల సోకు ఉంటుంది. అయితే ఎక్కువమందికి గుట్కా , పాన్, మసాలాజర్దాలు ఉంటాయి. ప్రభుత్వం వీటిని నిషేధించినా కానీ ఏ మారుమూల పోయినా బ్లాక్ లో దొరుకుతూనే ఉంటాయి.

తెలంగాణ ప్రభుత్వం కూడా గుట్కాను నిషేధించింది.కానీ ఇది చాలా చోట్ల అక్రమంగా కనిపిస్తూనే ఉంది. గుట్కాలు, జర్ధాలు లేని చోటు అంటూ లేదు. అమ్మకందారులు విరివిగానే అమ్ముతున్నారు.  

తాజాగా ఇద్దరు తెలంగాణ మంత్రులు చేతిలో నంజుకొని నోట్లో వేసుకున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, గంగుల కమలాకర్ లు రహస్యంగా తిన్న ఆ పదార్థం ఏంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ కుమార్ ఇప్పుడు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి ట్వీట్ చేశాడు. ‘తెలంగాణలో గుట్కా నిషేధించబడింది. కానీ ఈ మంత్రులు దాన్ని ఎలా పొందగలిగారు? ఎవరు అక్రమ రవాణా,సరఫరాచేస్తున్నారు. నిషేధిత ఉత్పత్తులను వినియోగిస్తున్న ఈ మంత్రులపై పోలీసులు చర్యలు తీసుకుంటారా?’ అని ప్రశ్నించారు.

వెంటనే తలసాని, గంగులను మంత్రివర్గం నుంచి తొలగించాలని సీఎం కేసీఆర్ ను దాసోజు శ్రావణ్ డిమాండ్ చేశారు. మంత్రులపై చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని కోరారు. టీఆర్ఎస్ పాలనలో అక్రమ మాదక ద్రవ్యాల రవాణా కేంద్రంగా హైదరాబాద్ మారుతోందని శ్రావణ్ ఆరోపించారు.

ఈ వీడియోలో తలసాని, గంగుల రహస్యంగా ఏదో పంచుకుంటూ తింటున్నారని స్పష్టంగా కనిపిస్తోంది. నెటిజన్లు ఇది గుట్కా అని సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారు.

అయితే ఈ వీడియోపై, గుట్కా ఆరోపణలపై అటు మంత్రులు కానీ.. ఇటు టీఆర్ఎస్ నేతలు కానీ స్పందించలేదు. అసలు అది ఆరోపిస్తున్నట్టు గుట్కానా? లేక సోంపునా అన్నది తేలాల్సి ఉంది. దీనిపై ఆ ఇద్దరు మంత్రులే స్పందించాల్సిన అవసరం ఉంది.




Tags:    

Similar News