మాజీ ఎంపీ వివేక్ తీన్ మార్

Update: 2015-11-28 06:11 GMT
వరంగల్ ఉప ఎన్నిక ఫలితంపై టీఆరెస్ నేతల్లో ఎంత సంబరం ఉందో అంతకుమించి సంబరు పడుతున్నారు ఆ కాంగ్రెస్ నేత... అవును.. వరంగల్ లోక్ సభ టిక్కెట్ చేజారిన పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ అందుకు చాలా ఆనందపడుతున్నారట. తాను ఆ ఎన్నికల్లో పోటీచేయకపోవడంపై ఆయన చాలా హ్యాపీగా  ఉన్నారట... దాంతోపాటు వరంగల్ ఉప ఎన్నిక సందర్భంగా చోటుచేసుకున్న  మరికొన్ని అంశాలూ ఆయన తో తీన్ మార్ డ్యాన్స్ చేయిస్తున్నాయని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
    
వరంగల్ ఉప ఎన్నిక ఫలితం చూసిన తరువాత తాను అక్కడ పోటీ చేయకపోవడంపై సంతోషిస్తున్న వివేక్.. ఆ ఆనందానికి మించి ఇంకో విషయంలో ఇంకా ఆనందపడుతున్నారట. వరంగల్ లో పోటీ చేయడానికి తొలుత ఇష్టపడని వివేక్.. ఆ తరువాత అంగీకరించారు. కానీ, సర్వే సత్యనారాయణ సైంధవుడిలా అడ్డుపడ్డారు.  టీఆర్ ఎస్ లోకి వెళ్లొచ్చిన వివేక్ కు వరంగల్ సీటు ఎలా ఇస్తారని ప్రశ్నించిన సర్వే సత్యనారాయణ అనూహ్య పరిణామాల అనంతరం ఆయన కోరుకున్నట్లే టిక్కెట్ తెచ్చుకుని పోటీ చేశారు. ఏదో పొడిచేద్దామని అందరికీ పొగపెట్టిన ఆయన అక్కడ డిపాజిట్ కూడా తెచ్చుకోలేక చతికిలబడ్డారు. తనకు సీటు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సర్వేకు ఓట్లు తగ్గడానికి వివేక్ కూడా ఓ కారణమని కాంగ్రెస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తన టీవీ ఛానల్ ద్వారా కాంగ్రెస్ కంటే ఎక్కువగా టీఆర్ ఎస్ కే అనుకూల ప్రచారం దక్కేలా చేసిన వివేక్... లోకల్ గా తనకు పట్టున్న నేతలను సైతం టీఆర్ ఎస్ వైపు వెళ్లేలా చేశారట. అంతేకాదు వరంగల్ లో ఓటమి కాంగ్రెస్ ది కాదని... అది సర్వే ఓటమి అని కాంగ్రెస్ సీనియర్ నేత, వివేక్ బావ శంకరరావు వ్యాఖ్యానించడం కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.
    
ఇలా... పోటీ చేయకుండా తాను సేవ్ కావడంతో పాటు తనను ఇబ్బందిపెట్టిన సొంతపార్టీలో ప్రత్యర్థి చిత్తుచిత్తుగా ఓడిపోవడంపై వివేక్ ఫుల్ హ్యాపీగా ఉన్నారట. అంతేకాదు... టిక్కెట్ ఇస్తామని అధిష్ఠానం ఎదురొచ్చి బతిమాలితే ఓకే అన్నా చివరకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఆ కారణాన్ని చూపించి భవిష్యత్తులో అవసరమైతే తన డిమాండ్లు ఏవైనా సాధించుకునే వీలుంటుందని వివేక్ భావిస్తున్నారు. ఇలా మూడు కారణాలతో హ్యాపీ ఫీలవుతున్న ఆయన తీన్ మార్ వేస్తున్నారని... ఆ ఆనందంలోనే కుటుంబ స్నేహితులతో కలిసి ఈ మధ్య ఆయన పార్టీ చేసుకున్నారని తెలుస్తోంది.
Tags:    

Similar News