ఆ కార్యక్రమానికి గవర్నర్ ఎందుకు రాలేదు?

Update: 2019-02-03 12:08 GMT
ఆయన సాక్షాత్తు ఆ జంగం ద్వారానే నియమితులైన వారు. ఆయన రాష్ట్రానికే ప్రథమ పౌరుడు. ఆయన తర్వాతే మరెవరైనా. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు అయినా ఆయన తర్వాతే. రాష్ట్ర ప్రజలను పాలించే ప్రభుత్వ దిశా నిర్దేశాలు నిర్దేశించేది ఆయనే. దేశంలో ఏ శాసనసభలో నైనా సమావేశాల ప్రారంభంలో ప్రభుత్వం తరఫున మాట్లాడవలసింది ఆయన. ఇంతకీ ఆయనెవరు అనుకుంటున్నారా?. రాష్ట్ర గవర్నర్. ఆ పదవిలో ఎవరున్నారు అన్నది కంటే ఆ పదవికే రాజ్యాంగంలో ఎంతో పరువు ఉంటుంది. సమైక్య రాష్ట్రం విడిపోయిన తర్వాత అటు తెలంగాణకు, ఇటు ఆంధ్రప్రదేశ్ కు కూడా ఒక్కరే గవర్నర్ గా ఉన్నారు. ఆయనే నరసింహన్. రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా ఉన్నది ఆయనే. రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వం తరఫున ఏ కార్యక్రమం జరిగినా గవర్నర్ ఉండి తీరాల్సిందే. అలా జరగలేదంటే ఆ రాష్ట్రంలో రాజకీయంగా ఏదో జరుగుతున్నట్లుగా భావిస్తారు ప్రజలు.

ఆంధ్రప్రదేశ్‌ లో అదే జరుగుతోంది. రాష్ట్రం విడిపోయిన తరువాత నాలుగున్నరేళ్లకు హైకోర్టు విభజన జరిగింది. విభజన అనంతరం ఎవరి కోర్టుకు వాళ్ళు వెళ్ళిపోయారు. తెలంగాణకు హైకోర్టుకు భవనాలు, సిబ్బంది, తగిన వసతి ఉంది. ఆంధ్రప్రదేశ్ కు మాత్రం ప్రత్యేక భవనం గాని, ఇతర సదుపాయాలు కాని లేవు. దీంతో  హైకోర్టు నిర్మాణం పనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి చేసింది. అలాగే శాశ్వత భవన నిర్మాణానికి ఆదివారం నాడు శంకుస్థాపన చేసింది. ఈ రెండు కార్యక్రమాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ ప్రారంభించారు. వీటికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. హాజరు కానిది రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్ మాత్రమే. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహ లేకుండానే హైకోర్టు తాత్కాలిక భవనం ప్రారంభం.. శాశ్వత భవనానికి పునాది కూడా పడిపోయాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్ రాకపోవడం వెనుక రాజకీయ కారణాలున్నాయా...?లేక వ్యక్తిగత కారణాలున్నాయా.. ? అని అటు రాజకీయ పక్షాల్లోను, ఇటు తెలుగు ప్రజల్లోనూ కూడా చర్చ జరుగుతోంది.
Tags:    

Similar News