చంద్రబాబు అసెంబ్లీకి రాక తప్పదా... ?

Update: 2021-11-23 03:03 GMT
చంద్రబాబు ఎపుడూ ఆవేశంగా ప్రకటనలు చేయరు. ఆయన ఏ విషయం మీద అయినా ఒకటికి పదిమార్లు ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. అలాంటి చంద్రబాబు తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తన వైఖరికి భిన్నంగా ఈ సభకు నమస్కారం అనేశారు. అంతే కాదు తాను మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే సభలో అడుగుపెడతాను అని కూడా గట్టిగానే  శపధం చేశారు. ఆ సభలో బాబుకు అవమానం జరిగింది. దాని మీద ఆయన అంత సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అయితే సభలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా స్పీకర్ ముందు పెట్టి బాధ్యుల చేత క్షమాపణలు చెప్పించడమే బాధిత సభ్యుల విధి. ఆ విషయం చంద్రబాబుకు తెలియనిది కాదు. అయితే ఆయన తన ఆవేదనను ఎంత అణచుకున్నా ఆగనిదైంది. దాంతో ఆయన సభ నుంచి బయటకు వచ్చేశారు.

అయితే ఇప్పటికి సరిగ్గా రెండున్నరేళ్ళకు పైగా సార్వత్రిక ఎన్నికలకు సమయం ఉంది. చంద్రబాబు ఇప్పటి నుంచే జనాల్లో ఉండాలనుకున్నా ఎన్నికల వేడి ఆరు నెలల ముందే పుడుతుంది. ఇక చంద్రబాబు పాదయాత్ర అన్నా బస్సు యాత్ర చేసినా జనాలకు కొత్త ఏమీ కాదు, దాంతో క్యూరియాసిటీని తెచ్చే విషయం ఏదీ లేకపోతే ఈ యాత్రలు కూడా పూర్తిగా సక్సెస్ కావు. ఈ విషయాలు ఇలా ఉంటే అసెంబ్లీని చంద్రబాబు ఒక్కరే బాయ్ కాట్ చేస్తారా లేక ఎమ్మెల్యేలు అంతా చేస్తారా అన్నది స్పష్టత లేదు, మరో వైపు శాసనమండలిలో కూడా అందరు ఎమ్మెల్సీలు బాయ్ కాట్ చేస్తారా లేదా చూడాలి.

అక్కడా ఇక్కడా కలిపి టీడీపీకి ముప్పయి మందికి పైగా సభ్యుల బలం ఉంది. ఇపుడే సభకు రాం రాం అంటే జనాల రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు. అసెంబ్లీకి రాను అని చెప్పేస్తే జనాలు కూడా ఓటెందుకు వేయాలి అని అడిగినా అడుగుతారు. నాడు జగన్ అయితే పాదయాత్రతో చివరి రెండేళ్ళూ ప్రజలతోనే  గడిపారు.  దాని కంటే ఎక్కువ సమయమే ఇపుడు ఉంది. దాంతో టీడీపీ సభను బాయ్ కాట్ చేసి తప్పు చేసిందా అన్న చర్చ అయితే ఉంది. ఈ  కన్నీళ్ళూ సింపతీ రేపు లేని నాడు అసెంబ్లీ బాయ్ కాట్ కూడా పొరపాటే అనిపించకమానదు.

ఇంకో వైపు చూస్తే చంద్రబాబు ఎలాగైనా ఒట్టు తీసి గట్టు మీద పెట్టి అసెంబ్లీకి వచ్చేలా వైసీపీ దూకుడు కూడా ఉండబోతోంది అంటున్నారు. మూడు రాజధానుల మీద కొత్తగా బిల్లుని ఆమోదిస్తామని జగన్ సర్కార్ చెబుతోంది. ఒకవేళ ఆ బిల్లుని కనుక ఉభయ సభల్లో ప్రవేశపెడితే మాత్రం కచ్చితంగా టీడీపీ హాజరు కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ బిల్లును అడ్డుకోవడానికైనా వెళ్లకపోతే ఆ తప్పు పూర్తిగా టీడీపీది చంద్రబాబుదే అవుతుంది అంటున్నారు. అమరావతి రైతులు బాబుని నమ్మి భూములు ఇచ్చారు. మళ్లీ జగన్ మూడు రాజధానులు అంటూ అమరావతి విషయంలో అదే అన్యాయం చేస్తే మాత్రం టీడీపీ తరఫున నిలచి కనీసం పోరాడే వారు సభలో లేకపోతే రైతులకు కూడా ఆ పార్టీ చెడ్డ అవుతుంది.

తమకు అండగా లేని టీడీపీ విషయంలో వారి రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. మొత్తానికి జగన్ ఏమనుకుని మూడు రాజధానుల చట్టం రద్దు చేశారో, కొత్త చట్టం తేవాలనుకుంటున్నారో తెలియదు కానీ ఈ బిల్లు కనుక సభ  ముందుకు వస్తే మాత్రం చంద్రబాబు కచ్చితంగా అసెంబ్లీ ముఖం చూడాల్సిందే అంటున్నారు. ఈ విషయంలో రైతుల నుంచి కూడా విపరీతమైన వత్తిడి అయితే టీడీపీకి ఉండడం ఖాయమని చెబుతున్నారు.
Tags:    

Similar News