చింతమనేనికి శాశ్వత జైలు జీవితమేనా?

Update: 2019-11-07 05:32 GMT
ఎవరు చేసుకున్న దానికి వారే అనుభవించాలి.. గడిచిన చంద్రబాబు ప్రభుత్వంలో దెందలూరు అనే సామంత రాజ్యంలో ఆడింది ఆట పాడింది పాటగా ఏలిన నాటి ఎమ్మెల్యే రాజావారు చింతమనేనికి ఇప్పుడు శ్రీకృష్ణ జన్మస్థానమే దిక్కయ్యేలా కనిపిస్తోందన్న వాదన వినిపిస్తోంది. చింతమనేని చింతలు చూసి ఇప్పుడు టీడీపీ పార్టీ నేతలు, అధినేతలు సానుభూతి తెలుపడం తప్ప చేసేదీ ఏమీ లేని పరిస్థితి దాపురించిందట.

తాజాగా జైల్లో ఉన్న చింతమనేనిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు పరామర్శించారు. జైల్లో ఉన్న ఆయన వద్దకు వెళ్లి చింతమనేని మహాత్ముడు, గాంధేయవాది అంటూ పొగిడేశాడు. మరి బాధితులు ఎందుకు 50కు పైగా కేసులను ఈ గాంధేయవాదిపై పెట్టారో అర్థం కావడం లేదు. కనీసం చినబాబైనా ఒక్కసారి ఆ బాధితులను కలిశాక ఈ మాటలు అంటే బావుండేదని బాధితులంతా ఆరోపిస్తున్నారు. లోకేష్ బాబు కలిశాకే చింతమనేనికి మరింత కష్టాలు మొదలయ్యాయి. మరో కేసులో ిచింతమనేనికి రిమాండ్ పొడిగించడం విశేషం.

చింతమనేని చంద్రబాబు హయాంలో చేసిన ఆగడాలపై ఎన్నో ఆధారాలున్నాయి. స్వయంగా ఓ మంత్రిపై దాడి చేసిన కేసులో శిక్షను అనుభవిస్తున్నాడు. ఎంతో మందిని, దళితులను, అడ్డువచ్చిన వారిని.. ఇక దందాల్లో చింతమనేని బెదిరించిన వారి సంఖ్య బాగానే ఉందని బాధితులు చెబుతున్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే వారంతా ధైర్యంతో ముందుకు వచ్చి పోలీస్ స్టేషన్ గడప తొక్కి కేసులు పెట్టారు. బాబు హయాంలో ఒక్క కేసు కూడా చింతమనేని పై నమోదు చేయని పోలీసులు ఇప్పుడు ఏకంగా 50కు పైగా కేసులను ఆయనపై బాధితుల ఫిర్యాదు మేరకు మోపారు. తాజాగా మరో 4 కేసులు కూడా నమోదైనట్టు తెలుస్తోంది. చింతమనేనిపై దాదాపు 70కు పైగా కేసులు నమోదైనట్టు తెలిసింది.

ఒక కేసులో బెయిల్ వచ్చేసరికి మరో కేసులో చింతమనేని రిమాండ్ అయిపోతున్నారు. తాజాగా మరో కేసులో ఈనెల 20వరకు చింతమనేనికి కోర్టు రిమాండ్ ను విధించింది. రెండు నెలల నుంచి జైల్లోనే ఉంటున్న ఈయన ఇప్పట్లో బయటకు రావడం కష్టమనేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News