గోరంట్ల మాధవ్ కోసం డీజీపీకి ఈసీ లేఖ!

Update: 2019-03-23 07:02 GMT
తనను ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా ఉండేందుకు కుట్ర జరుగుతూ ఉందని - తన వీఆర్ ఎస్ విషయంలో కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా.. రిలీవింగ్ లెటర్ ఇవ్వకుండా ఏపీ పోలీసులు తన మీద కుట్ర చేస్తూ ఉన్నారని అంటున్న అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ సీటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ కు ఈసీ ఊరటను ఇచ్చింది. గోరంట్ల మాధవ్ వీఆర్ఎస్ ను పెండింగ్ పెట్టిన ఏపీ పోలీసులకు ఏపీ ఎన్నికల కమిషనర్ ద్వివేదీ లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ఈ అంశాన్ని పరిష్కరించాలని ఆయన సూచించినట్టుగా తెలుస్తోంది.

ఇప్పటికే గోరంట్ల మాధవ్ ఈ అంశంలో కోర్టును కూడా ఆశ్రయించారు. కోర్టు కూడా ఇందుకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మాధవ్ వీఆర్ఎస్ ను ఆమోదించాలని, ఎన్నికల్లో పోటీ చేసే ఆయన హక్కుకు ప్రాధాన్యతను ఇవ్వాలని పోలీసు శాఖకు కోర్టు సూచిస్తూ తీర్పును ఇచ్చింది. ఆ తీర్పు కాపీతో రాయలసీమ ప్రాంత పోలీస్ ఉన్నతాధికారులను మాధవ్ ఆశ్రయించినా వారు తప్పించుకు తిరుగుతున్నారనే మాట వినిపిస్తోంది.

ఈ విషయంలో మాధవ్ తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తన రిలీవింగ్ లెటర్ ను పెండింగ్ లో పెట్టారని, ఒక బీసీ అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేస్తే సహించలేకపోతున్నారని, చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో ఈ కుట్ర జరుగుతోందని మాధవ్ వాపోతూ ఉన్నారు.

హిందూపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాధవ్ పోటీ చేస్తే గట్టి అభ్యర్థి అవుతారనే లెక్కలతోనే ఇలా చేస్తున్నారనే విమర్శ కూడా వినిపిస్తోంది. అయితే వాటిని పట్టనట్టుగా అధికారులు మాధవ్ కు చుక్కలు చూపుతున్నారు.

ఈ నేపథ్యంలో ఈసీని కూడా కలిసి మాధవ్ పరిస్థితిని విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి.. విషయమై  ఏపీ డీజీపీకి లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. మరి ఎన్నికల అధికారి లేఖను అయినా ఏపీ పోలీసులు సీరియస్ గా తీసుకుంటారా, లేక తప్పించుకుని తిరుగుతారా.. అనేది చూడాలిక!
Tags:    

Similar News