అమ్మకానికి హైదరాబాద్ లో లక్ష ఇళ్లు రెడీ

హైదరాబాద్ మహానగరంలో లక్షకు పైగా ఇళ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు క్రెడాయ్ హైదరాబాద్, సీఆర్ఈ మ్యాట్రిక్స్ రూపొందించిన నివేదిక వెల్లడించింది.

Update: 2024-08-03 06:08 GMT

హైదరాబాద్ మహానగరంలో లక్షకు పైగా ఇళ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు క్రెడాయ్ హైదరాబాద్, సీఆర్ఈ మ్యాట్రిక్స్ రూపొందించిన నివేదిక వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన ఈ నివేదికలో మరిన్ని ఆసక్తికర అంశాలు ఉన్నాయి. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దారుణంగా దెబ్బతిందన్న మాట బలంగా ప్రచారమవుతున్న వేళ.. అందుకు భిన్నంగా క్రెడాయి తాజా రిపోర్టు లోని అంశాలు ఉండటం ఆసక్తికరంగా మారింది.

ఈ నివేదిక మొత్తం ఐదేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పటి మార్కెట్ పరిస్థితి ఎలా ఉందన్న అంశాన్ని ఎక్కువగా ఫోకస్ చేశారు. 2019 ప్రథమార్థంతో పోలిస్తే 2024లో అమ్మకాలు 148 శాతం వ్రద్ధి నమోదైనట్లుగా పేర్కొన్నారు. రూ.5 కోట్ల కంటే ఎక్కువ విలువ ఉన్న స్థిరాస్తుల అమ్మకాల్లో ఏకంగా 760 శాతం వ్రద్ధి నమోదైనట్లుగా వెల్లడైంది. అమ్మకానికి లక్షకు పైగా ఇళ్లు సిద్ధంగా ఉన్నాయని.. గతంతో పోలిస్తే ఇన్వెంటరీ టైం తగ్గుతుందని ఈ రిపోర్టు వెల్లడించింది. ఐదేళ్ల క్రితం అమ్మిన ఇళ్ల విలువ రూ.34,044 కోట్లు ఉంటే.. గత ఏడాది ఇది రూ.1,15,759కోట్లకు చేరుకుందని.. ఈ ఏడాది దాన్ని అధిగమిస్తుందన్నారు. రిపోర్టులో పేర్కొన్న కీలక అంశాల్ని చూస్తే..

- ఈ ఏడాది తొలి ఆర్నెల్లలో 38,660 ఇళ్లను విక్రయించారు. వీటి విలువ రూ.58,841 కోట్లు. గత ఐదేళ్లలో ఒక ఏడాది మొదటి ఆర్నెల్లలో ఇంత భారీగా అమ్మకాలు సాగటం ఇదే తొలిసారి.

- నగరంలోని మొదటి ఆర్నెల్ల అమ్మకాల్లో 62 శాతం ఇళ్లు నార్త్ వెస్టులోనే సాగాయి. వీటి విలువ రూ.36,276 కోట్లు.

- నార్త్ ఈస్ట్ లో 4796 ఇళ్ల అమ్మకాలు నమోదు అయితే.. సౌత్ వెస్ట్ లో 4957 యూనిట్లు అమ్ముడయ్యాయి.

- రూ.5-10 కోట్లు విలువ ఉన్న ఇళ్ల అమ్మకాల్లో ఐదేళ్లతో పోలిస్తే 449 శాతం పెరగ్గా.. రూ.10కోట్ల కంటే ఎక్కువ విలువ కలిగిన ఇళ్ల విభాగంలో అమ్మకాలు 63 రెట్లు ఎక్కువ అయ్యాయి.

- 2019లో సగటు ఇంటి విలువ రూ.1.1 కోట్లు ఉంటే.. ఇప్పుడు అది కాస్తా రూ.1.5కోట్లకు పెరిగింది. అంటే.. సగటు ఇంటి విలువ 44 శాతం పెరిగింది.

- ఈ ఏడాది మొదటి ఆర్నెల్లలో రూ.1-2 కోట్ల ధరల ఇళ్లు అత్యధికంగా అమ్ముడయ్యాయి.

- కొవిడ్ సంవత్సరం కంటే తక్కువగా ఈ ఏడాది మొదట్లో కొత్త యూనిట్ల ప్రాజెక్టులు మొదలయ్యాయి. జనవరి నుంచి జూన్ వరకు 21,936 యూనిట్లు మాత్రమే ప్రారంభమయ్యాయి. అమ్ముడు కాని ఇళ్ల యూనిట్లు 1,03,316 ఉన్నాయి. దీంతోకొత్త ప్రాజెక్టుల ప్రారంభాలపై బిల్డర్లు వెనక్కి తగ్గారు.

- ఇన్వెంటరీ అమ్మకాలకు 2020లో 1.68 ఏళ్లు పడితే.. ఇప్పుడది 1.33 ఏళ్లకు తగ్గింది. (ఇన్వెంటరీ ఇళ్లు అంటే.. ఇంటి నిర్మాణం పూర్తి అయి.. ఆక్యుపేషన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అప్పటికీ మిగిలిన ఉన్న ఇళ్లనే ఇన్వెంటరీ ఇళ్లుగా భావిస్తారు)

Tags:    

Similar News