రాములోరి గుడి కవరేజీలో బీబీసీ పక్షపాతం? ఆ మాట అన్నదెవరంటే?
మసీదు కంటే 2 వేల ఏళ్లకు ముందు అక్కడ ఒక దేవాలయం ఉందన్న విషయాన్ని బీబీసీ మర్చిపోవటాన్ని ఆయన వేలెత్తి చూపారు.
అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి సంబంధించిన కవరేజీ విషయంలో ప్రఖ్యాత మీడియా సంస్థ బీబీసీ తీవ్రమైన ఆరోపణల్ని ఎదుర్కొంటోంది. అయితే.. ఈ వాదనను భారతీయులు కాదు బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్ మన్ నోటి నుంచి రావటం మరింత ఆసక్తికరంగా మారింది. బీబీసీ మీద ఉత్తి పుణ్యానికే నిందలు వేసినట్లు కాకుండా ఆయన పలు అంశాల్ని ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తాజాగా హౌస్ ఆఫ్ కామన్స్ లో ఆయన మాట్లాడుతూ అయోధ్యలో రామాలయం ప్రారంభం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని.. కానీ బీబీసీ మాత్రం తన కవరేజీవిషయంలో పక్షపాతాన్ని ప్రదర్శించినట్లుగా పేర్కొన్నారు. బీబీసీ ఒక మసీదు విధ్వంసం జరిగిన ప్రదేశంగా తన కవరేజీలో ప్రస్తావించటంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.
మసీదు కంటే 2 వేల ఏళ్లకు ముందు అక్కడ ఒక దేవాలయం ఉందన్న విషయాన్ని బీబీసీ మర్చిపోవటాన్ని ఆయన వేలెత్తి చూపారు. అంతేకాదు.. మసీదు నిర్మాణం కోసం ముస్లింలకు 5 ఎకరాల స్థలం కేటాయించారన్న విషయాన్ని ప్రస్తావించకపోవటం.. బీబీసీ నిష్పక్షపాతంగా రిపోర్టింగ్ చేయకపోవటంపై సభలో చర్చ జరగాలని కోరారు. బీబీసీ బ్రిటన్ ప్రభుత్వ రంగ సంస్థ అన్న విషయం తెలిసిందే.
రామాలయం కవరేజీపై బీబీసీ రిపోర్టింగ్ ఫెయిల్ కావటంపై చట్టసభలో చర్చకు సమయాన్ని కేటాయించాలని ఇతర ఎంపీలను బ్లాక్ మన్ కోరటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయోధ్యలో ఇటీవల బాలరామాలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించటం.. దేశ వ్యాప్తంగా దీన్నో పండుగలా చేసుకోవటం తెలిసిందే. అయితే.. కవరేజీ విషయంలో బీబీసీ ఈ తీరులో వ్యవహరించిందన్న విషయాన్ని దేశీయ మీడియా గుర్తించకున్నా.. అల్లంత దూరాన ఉన్న బ్రిటన్ ఎంపీ ఒకరు గుర్తించటం గమనార్హం.