భారత క్రికెట్ కొత్త చాంపియన్ అతడేనట.. భవిష్యత్ కెప్టెన్ కూడా?

క్రికెట్ జెంటిల్మన్ గేమ్ మాత్రమే కాదు.. చాలా కఠినమైనది కూడా. దీంట్లో కొనసాగాలంటే శారీరకంగానే కాదు మానసికంగానూ ధైర్యం అవసరం. విజయాలను వైఫల్యాలను సమానంగా స్వీకరించాలి.;

Update: 2025-03-26 09:39 GMT
Shreyas Iyer Stunning Comeback In Cricket

కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత నాయకత్వంతో టీమ్ ఇండియా గత ఏడాది టి20 ప్రపంచ కప్ గెలిచింది.. మళ్లీ ఏడాదిలోపే వన్డే ఫార్మాట్ లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ వంటి పెద్ద టోర్నీలోనూ నెగ్గింది. ఈ రెండు సందర్భాల్లో రోహిత్ తో పాటు స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి గొప్పగా ఆడారు. భారత్ ను చాంపియన్ గా నిలిపారు. ఇప్పుడు వీరిద్దరూ రిటైర్మెంట్ ముంగిట ఉన్నారు. మరి భారత క్రికెట్ కొత్త చాంపియన్ ఎవరు?

క్రికెట్ జెంటిల్మన్ గేమ్ మాత్రమే కాదు.. చాలా కఠినమైనది కూడా. దీంట్లో కొనసాగాలంటే శారీరకంగానే కాదు మానసికంగానూ ధైర్యం అవసరం. విజయాలను వైఫల్యాలను సమానంగా స్వీకరించాలి.

సరిగ్గా ఏడాదిన్నర కిందట స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో 400 పైగా పరుగులు చేసిన బ్యాట్స్ మన్ ఆ వెంటనే జట్టుకు దూరమవుతాడా? కానీ, శ్రేయస్ అయ్యర్ అలానే దూరమయ్యాడు.

2023 వన్డే ప్రపంచ కప్ అనంతరం అయ్యర్ అనూహ్య పరిస్థితులను ఎదుర్కొన్నాడు. దేశవాళీల్లో ఆడాలని బీసీసీఐ కోరితే గాయం సాకు చూపాడు. ఆ తర్వాత ధిక్కరించినంత పని చేశాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టును కూడా కోల్పోయాడు.

ఓవైపు కుర్రాళ్లు దూసుకొస్తుండడం మరోవైపు అయ్యర్ వ్యవహార శైలి కారణంగా అతడు మళ్లీ టీమ్ ఇండియాలోకి రాడని అనుకున్నారు. కానీ, నిరుడు ఇదే సమయంలో జరిగిన ఐపీఎల్ లో కోల్‌ కతా నైట్ రైడర్స్‌ ను కెప్టెన్ గా చాంపియన్ చేయడంతో అయ్యర్ దశ తిరిగింది.

బీసీసీఐ కూడా శ్రేయస్ అయ్యర్ పట్ల తన ధోరణి మార్చుకుంది. బహుశా ఒక ప్లేయర్ విషయంలో ఇలా వెనక్కుతీరిగి చూసుకుందేమో? దీంతో అయ్యర్ తిరిగి టీమ్ ఇండియా గడప తొక్కాడు.

కోహ్లి గాయంతో ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ లో అనూహ్యంగా తుది జట్టులోకి వచ్చిన అయ్యర్.. చాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించి తన స్థాయి ఏమిటో చాటాడు. కీలక సందర్భాల్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తాజాగా అతడి సెంట్రల్ కాంట్రాక్ట్ ను పునరుద్ధరించాలని బీసీసీఐ భావిస్తోంది. వాస్తవానికి అయ్యర్ టెస్టుల్లోనూ రాణించాడు. ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో గనుక అతడు ఉండి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో?

పంజాబ్ రాత మారుస్తాడా?

ఐపీఎల్ లో తాజాగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీ చేపట్టిన అయ్యర్ తొలి మ్యాచ్ లోనే అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 97 పరుగుల వద్ద ఆగిపోయినప్పటికీ అయ్యర్ ఇన్నింగ్స్ సెంచరీకి తక్కువ కాదని చెప్పాలి.

ఇవన్నీ చూశాక ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ టైమ్ నడుస్తోందని అంటున్నారు.

కొసమెరుప: రూ.26.75 కోట్ల ఐపీఎల్ రెండో అత్యధిక ధరకు పంజాబ్ అయ్యర్ ను దక్కించుకుంది. సెంట్రల్ కాంట్రాక్టు లేకున్నా ఇంత ధర పెట్టింది. అయ్యర్ కంటే ఎక్కువ ధర పలికి పంత్ సహా చాలామంది ఆటగాళ్లు ఈ సీజన్ లో ఆడకపోతే విమర్శలు తప్పవు. అయ్యర్ మాత్రం పంజాబ్ కే కాదు టీమ్ ఇండియాకు భవిష్యత్ కెప్టెన్ అవుతాడని అనిపిస్తోంది.

Tags:    

Similar News