300 కాదు.. మళ్లీ 16.. సన్ రైజర్స్ దారుణమైన డౌన్ ఫాల్

గత సీజన్ లో దుమ్మురేపి ఐపీఎల్ కు కొత్త నిర్వచనం ఇచ్చిన సన్ రైజర్స్ ఈసారి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలుస్తోంది.;

Update: 2025-04-07 03:49 GMT
300 కాదు.. మళ్లీ 16.. సన్ రైజర్స్ దారుణమైన డౌన్ ఫాల్

సీజన్ ప్రారంభానికి ముందు 300 కొట్టే జట్టు ఏదైనా ఉందంటే అది సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్) మాత్రమే అని గొప్పగొప్ప మేధావులు అంచనా వేశారు.

సీజన్ ఇలా మొదలైందో లేదో.. తొలి మ్యాచ్ లో 286 పరుగులు కొట్టగానే అహో ఒహో అంటూ పొగడ్తలు.. కానీ, ఆ తర్వాతే సీన్ మారిపోయింది. సన్ రైజర్స్ డౌన్ ఫాల్ మొదలైంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ ఎడిషన్ లో సన్ రైజర్స్ ఆట నానాటికీ తీసికట్టు అన్నట్లుగా మారింది. ఎక్కడి 286.. ఎక్కడి 150..? ఈ సారి 300 కొట్టిన తొలి ఐపీఎల్ జట్టుగా నిలుస్తుందని అనుకుంటే అందులో సగం పరుగులైనా చేయడం లేదు. లీగ్ లో వరసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది.

ఇక పైకి లేవడం కష్టమే..?

గత సీజన్ లో దుమ్మురేపి ఐపీఎల్ కు కొత్త నిర్వచనం ఇచ్చిన సన్ రైజర్స్ ఈసారి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలుస్తోంది. ఎక్కడైతే 300 కొడుతుందని భావించారో అదే సొంతగడ్డపై దారుణ ప్రదర్శన చేస్తోంది. ఇదంతా చూస్తుంటే సన్ రైజర్స్ ఇక పైకి లేవడం కష్టమే అనే అభిప్రాయం కలుగుతోంది.

ఆదివారం మ్యాచ్ లో మరోసారి సన్ రైజర్స్ కు ’16’ అంకె కనిపించింది. ఉప్పల్ లో గత నెల 27న లక్నోతో జరిగిన మ్యాచ్ లో 190 పరగులు చేసినా ప్రత్యర్థి 16.1 ఓవర్లో ఛేదించింది.

సన్ రైజర్స్ విధించిన 163 పరుగుల టార్గెట్ ను మార్చి 30న ఢిల్లీ క్యాపిటల్స్ 16 ఓవర్లనే కొట్టిపారేసింది.

విశాఖపట్నంలో ఈ నెల 3న కోల్ కతా నైట్ రైడర్స్ 200 పరుగులు చేయగా.. సన్ రైజర్స్ కేవలం 16.4 ఓవర్లలోనే ఆలౌటైంది.

ఆదివారం ఉప్పల్ లోనే సన్ రైజర్స్ 152 పరుగులకు ఆలౌటవగా.. గుజరాత్ టైటాన్స్ 16.4 ఓవర్లలోనే కొట్టిపారేసింది.

300ను మనసులోంచి తీసివేయాలి

సన్ రైజర్స్ ప్రధాన బలం బ్యాటింగ్. నిరుడు దానితోనే ఫైనల్స్ వరకు వెళ్లింది. అయితే, ఈసారి బ్యాటింగే బలహీనతగా మారింది. ఓడిన అన్ని మ్యాచ్ లలో బ్యాటింగ్ వైఫల్యమే కారణం. ఓపెనర్లు హెడ్, అభిషేక్ విఫలమైతే సరైన మిడిలార్డర్ బ్యాటర్ లేకపోవడం సన్ రైజర్స్ ప్రధాన లోపం. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఉన్నప్పటికీ.. అతడు చివర్లో వచ్చి 30-40 పరుగులు చేసి స్కోరును పెంచగలడే కానీ.. అమాంతం భారీ ఇన్నింగ్స్ ఆడే తరహా కాదు. క్లాసెన్ వంటి బ్యాట్స్ మన్ కంటే నితీశ్ ను ముందు పంపడం కూడా సరైన వ్యూహం కాదు. అనికేత్ వర్మను ఆరో నంబరులో దింపే కంటే నాలుగో స్థానంలో ఆడిస్తే మెరుగుదల కనిపించవచ్చేమో..? ఏదేమైనా సన్ రైజర్స్ కు మళ్లీ ఉషోదయం కావాలంటే బాగా కష్ట పడాల్సిందే.

Tags:    

Similar News