స్టార్ హీరో సినిమా.. 4 నెలలు అయినా ఓటీటీలో రాలేదేం?
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన 'యూఐ' సినిమా గత ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.;

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన 'యూఐ' సినిమా గత ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. చాలా సంవత్సరాల తర్వాత ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. కేవలం కన్నడ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అంచనాలను యూఐ అందుకోలేకపోయింది. కన్నడంలోని ఆయన అభిమానులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. కానీ ఇతర భాషల్లో, రెగ్యులర్ ప్రేక్షకులు సినిమాను థియేట్రికల్ స్క్రీనింగ్ స్కిప్ చేసి, ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేద్దాం అనుకున్నారు.
థియేట్రికల్ రిలీజ్ అయ్యి నాలుగు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఓటీటీ స్ట్రీమింగ్ కావడం లేదు. సాధారణంగా ఈ మధ్య కాలంలో సినిమాలు అన్నీ కూడా ఓటీటీలో నాలుగు వారాల్లోనే వస్తున్న విషయం తెల్సిందే. కానీ ఈ సినిమా మాత్రం నాలుగు నెలలు అయినా స్ట్రీమింగ్ కావడం లేదు. ఉపేంద్ర అభిమానులు థియేట్రికల్ రిలీజ్ సమయంలో చూడకుండా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేశారు. కానీ ఇప్పుడు సినిమా ఓటీటీకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయక పోవడంకు కారణం ఏంటి అనే విషయమై రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అసలు విషయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.
ఆ మధ్య ఉపేంద్రకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ జీ 5 వారు 'యూఐ' సినిమా స్ట్రీమింగ్ హక్కులను భారీ మొత్తానికి కొనుగోలు చేశారు అంటూ వార్తలు వచ్చాయి. కొనుగోలుకు సంబంధించిన వార్తలు వచ్చి కూడా చాలా కాలం అయింది. కానీ ఇప్పటి వరకు స్ట్రీమింగ్ కాలేదు. జీ 5 వారు అసలు యూఐ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వడం లేదు. దాంతో సినిమాను జీ 5 వారు కొనుగోలు చేశారా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకు ఓటీటీ బిజినెస్ జరిగిందా? లేదా? అనే విషయమై క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ సభ్యులు లేదా హీరో ఉపేంద్ర నోరు విప్పాల్సి ఉంది.
ఒక వైపు ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్ లేదని అభిమానులు ఆందోళన చేస్తున్న సమయంలో మరో వైపు సినిమాకు సంబంధించిన శాటిలైట్ డీల్ కంప్లీట్ చేశారని, ప్రముఖ నేషనల్ ఛానల్ అన్ని రీజనల్ భాషల్లోనూ టెలికాస్ట్ చేయడం కోసం భారీ మొత్తానికి హక్కులు కొనుగోలు చేసినట్లు సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలు ఎక్కువ శాతం ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత శాటిలైట్ టెలికాస్ట్‌కు వస్తున్నాయి. కానీ యూఐ సినిమా మాత్రం మొదట శాటిలైట్ లో టెలికాస్ట్ అయ్యి, ఆ తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈమధ్య కాలంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా అలాగే అయిన విషయం తెల్సిందే. యూఐ విషయంలోనూ అదే జరిగేనా చూడాలి.