అకిరా.. ఇంటర్నెట్ వినియోగదారుల్ని వణికిస్తోంది
తాజాగా వెలుగు చూస్తున్న ఉదంతాల్లో అకిరాగా పేర్కొంటూ రాన్సమ్ వైరస్ ప్రమాదకరంగా మారిందని చెబుతున్నారు.
ఏ మాత్రం ఛాన్సు చిక్కినా విలువైన సమాచారాన్ని కొట్టేసే సైబర్ దొంగల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంబంధం లేని లింకుల్ని పంపి.. ట్రాప్ చేసేందుకు వినియోగించే వైరస్ లతో వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
అలాంటి కోవలోకి వచ్చే రాన్సమ్ వేర్ తో ఎంత డేంజర్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పలుమార్లు హడలెత్తించిన రాన్సమ్ వేర్.. ఇప్పుడు అకిరా పేరుతో డేటాను దోచేస్తున్న వైనాన్ని ప్రస్తావిస్తున్నారు.
విండోస్.. లైనక్స్ ఆధారిత కంప్యూటర్లపై మాల్ వేర్ దాడి చేస్తోందన్న విషయాన్ని సైబర్ సెక్యూరిటీ సంస్థ వార్నింగ్ ఇస్తోంది. తాజాగా వెలుగు చూస్తున్న ఉదంతాల్లో అకిరాగా పేర్కొంటూ రాన్సమ్ వైరస్ ప్రమాదకరంగా మారిందని చెబుతున్నారు. డేటాను తస్కరించి.. అందుకు ప్రతిగా భారీగా డబ్బులు గుంజేస్తున్న ఈ వైరస్ తో జర జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ముందుగా వ్యక్తిగత సమాచారాన్ని.. ఆపై ఎన్ క్రిప్ట్ డేటాను దొంగలిస్తున్న ఈ వైరస్.. బాధితుల నుంచి భారీగా డబ్బుల్ని డిమాండ్ చేస్తోంది. ఒకవేళ వారు చెల్లించని పక్షంలో వారి డేటాను తమ డార్క్ వెబ్ బ్లాగ్ లో విడుదల చేస్తున్నట్లుగా భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం చెబుతోంది.
తాము టార్గెట్ చేసిన వారి సమాచారాన్ని దోచేసి.. వారి కంప్యూటర్లను వాడేందుకు వీలు కాని విధంగా చేసే అకిరాతో ఇబ్బంది అంతా ఇంతా కాదని.. వారు కోరిన మొత్తాన్ని చెల్లిస్తే తప్పించి తిరిగి కంప్యూటర్ మన అధీనంలోకి రాదంటున్నారు.
ఈ పరిస్థితుల్లో.. సంబంధం లేని లింకుల్ని.. అనుమానస్పద మొయిల్స్ ను తెరవకుండా డిలీట్ చేయటం చాలా మంచిదన్న విషయాన్ని మర్చిపోకూడదు.