పిల్లల చేతులు కట్టేసి అట్ల పెనం మీద కూర్చోబెట్టి హింస

వారిద్దరు కవలలు. చిన్నపిల్లలు. మరీ అల్లరి చేస్తే మందలిస్తామే తప్పించి.. దారుణ శిక్షలు వేసే ఆలోచన చేయలేం. కానీ.. ఈ సవతితల్లి మాత్రం అమ్మతనానికే కళంకం తెచ్చింది.;

Update: 2025-03-31 10:30 GMT
పిల్లల చేతులు కట్టేసి అట్ల పెనం మీద కూర్చోబెట్టి హింస

వారిద్దరు కవలలు. చిన్నపిల్లలు. మరీ అల్లరి చేస్తే మందలిస్తామే తప్పించి.. దారుణ శిక్షలు వేసే ఆలోచన చేయలేం. కానీ.. ఈ సవతితల్లి మాత్రం అమ్మతనానికే కళంకం తెచ్చింది. ఆమె పెట్టిన చిత్రహింసకు ఒక పిల్లాడు చనిపోతే.. మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విన్నంతనే షాక్ కు గురయ్యే ఈ ఉదంతం ఏపీలోని ఉమ్మడి గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.

పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు గ్రామానికి చెందిన సాగర్ తాపీ పని చేస్తుంటాడు. పదేళ్ల క్రితం క్రిష్ణా జిల్లాకు చెందిన అనూషతో పెళ్లైంది. మొదటి కాన్పులో ఇద్దరుకవలలు (కార్తీక్, ఆకాశ్) పుట్టారు. ప్రస్తుతం వారికి ఆరేళ్ల వయసు. రెండోసారి గర్భం దాల్చి పాపకు జన్మనిచ్చి చనిపోయింది. దీంతో ఆ పాపను దత్తత ఇచ్చేశారు. ఇద్దరు మగ పిల్లల్ని సాగర్ తన దగ్గరే ఉంచేసుకున్నాడు. రెండేళ్ల క్రితం గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన లక్ష్మితో రెండో పెళ్లైంది.

అందరూకలిసి ఫిరంగిపురంలోనే ఉంటున్నారు. ఇదిలా ఉండగా.. ఎనిమిదినెలల క్రితం ఒక పాపకు జన్మనిచ్చింది లక్ష్మి. అప్పటివరకు కవల పిల్లల్నిబాగానే చూసుకుంటున్న ఆమె.. ఆ తర్వాత నుంచి చిత్రహింసలు పెట్టటం మొదలు పెట్టింది. చీటికిమాటికి కొడుతూ నరకం చూపించేది. భర్త కూడా వీటికి అడ్డు చెప్పకపోవటంతో ఆమె మరింత రెచ్చిపోయింది. ఈ నెల 29న అకారణంగా చిన్నారుల్ని చితకబాదేసిన ఆమె తీరుతో పిల్లలు ఇద్దరు పెద్ద ఎత్తున అరుపులు.. ఏడుపులతో ఇరుగుపొరుగు వారు పిల్లల మేనత్తకు సమాచారం ఇచ్చారు,

దీంతో ఆమె అదే రోజు ఫిరంగిపురానికి వచ్చింది. అప్పటికే కార్తీక్ తీవ్ర గాయాలతో అపస్మారకస్థితిలో ఉన్నాడు. మరో పిల్లాడు ఆకాశ్ బాగా వేడెక్కిన అట్ల పెనం మీద చేతులు కట్టేసి కూర్చోబెట్టిన కారణంగా కాలిన గాయాలతో విలవిల్లాడుతున్నాడు. దీంతో.. ఆమె భార్యభర్తలు ఇద్దరిని నిలదీయగా.. వారిద్దరు పిల్లల్ని తీసుకొని కొండవీడుకు వెళ్లిపోయారు. ఈ సమాచారాన్ని పోలీసులకు అందించిన మేనత్త విజయ.. వారిపై ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు కొండవీడుకు చేరుకునేసరికి కార్తీక్ చనిపోయి ఉన్నాడు.

కాలిన గాయాలతో తీవ్రంగా అవస్థలు పడుతున్న ఆకాశ్ ను చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. కవల పిల్లలు ఇద్దరు తన వారసత్వానికి అడ్డు వస్తున్నారన్న కారణంగా కక్ష పెట్టుకొని చిత్రహింసలకు గురి చేసినట్లు భావిస్తున్నారు. పిల్లల్ని ఎంతలా చిత్ర హింసలు పెట్టిన వైనం వారికి ఉన్న గాయాల్ని చూస్తే అర్థమయ్యే పరిస్థితి. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Tags:    

Similar News