'ప్రేమ లేఖ' బ్యూటీ సడెన్‌గా తెరపైకి?
తళా అజిత్ సరసన బ్లాక్ బస్టర్ చిత్రం 'ప్రేమ లేఖ'లో అద్భుతమైన రొమాన్స్ తో అదరగొట్టిన హీరాను 90ల నాటి యూత్ అంత తేలిగ్గా మర్చిపోలేరు
తళా అజిత్ సరసన బ్లాక్ బస్టర్ చిత్రం 'ప్రేమ లేఖ'లో అద్భుతమైన రొమాన్స్ తో అదరగొట్టిన హీరాను 90ల నాటి యూత్ అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఈ సినిమాలో అజిత్ ని పిచ్చిగా ప్రేమించి వెంటాడే అమ్మాయిగా హీరా నటనకు ఫిదా కాని వారు లేరు. పట్టు పట్టు పరువాల పట్టు! పాటలో హీరా అందచందాలు, అభినయం ప్రత్యేకించి కుర్రకారుకు గుబులు పుట్టించింది. అందుకే ఇప్పుడు హీరా ఏమైంది? అంటూ నెటిజనుల్లో ఆరాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో సడెన్ గా హీరా లేటెస్ట్ ఫోటోషూట్ తో టచ్ లోకి వచ్చింది. నటి హీరా డీటెయిలింగ్ లోకి వెళితే...
కిల్లింగ్ లుక్స్‌తో కుర్రకారు గుండెలు కొల్లగొట్టిన అందాల కథానాయిక హీరా సౌత్ లో అన్ని భాషల్లోను నటించింది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలతో హీరా చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసింది. బ్లాక్ బస్టర్ ప్రేమలేఖ చిత్రంలో దేవయానితో పాటు హీరా అద్భుత నటనతో కట్టి పడేసింది. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోను బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. అపరిచిత యువతితో ప్రేమలో ఉన్న అజిత్ కోసం పడి చచ్చే యువతిగా హీరా సమ్మోహన నటనకు భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడు 51 సంవత్సరాల వయస్సులో హీరా లేటెస్ట్ ఫోటోలు అంతర్జాలంలోకి విడుదలయ్యాయి. హీరా ఇప్పటికీ తన గ్లామర్ ని కించిత్ తగ్గకుండా కాపాడుకుంటోంది.
తమిళ చిత్రసీమలో హీరా గుండె, నీ బడి నాన్ బడి, తిరుడా తిరుడా, సతిలేలావతి, కాదల్ కొట్టో, అవ్వై షణ్ముఖి వంటి చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా హార్ట్ సినిమాలోని పోటువైత ఒరు వట్ట నీలా అనే పాట సీక్వెన్స్‌లో హీరో అభినయం ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఈ పాట అద్భుత ప్రశంసలు అందుకుంది. హీరా నటన 1991 తమిళ రొమాంటిక్ డ్రామా చిత్రం 'ఇదయం'తో ప్రారంభమైంది. ఇందులో ట్రయాంగిల్ ప్రేమలో చిక్కుకున్న వైద్య విద్యార్థిని పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ సినిమా ఘన విజయం ఆమెను వెలుగులోకి తెచ్చింది. పరిశ్రమలో మంచి ప్రతిభావంతురాలిగా స్థిరపడింది. నటుడు శరత్‌కుమార్ సరసన చెప్పుకోదగ్గ పాత్రల్లో నటించాక, 'శభాష్ బాబు'లో ఒంటరి తల్లి పాత్రతో తనలోని బహుముఖ ప్రజ్ఞను ఆవిష్కరించింది.
ముఖ్యంగా తిరుడా తిరుడాలో తన నటన కెరీర్ లో మైలు రాయిగా మారింది. గ్రామీణ అమ్మాయిగా దొంగగా నటించింది. నిజానికి మోడ్రన్ గాళ్ పాత్రల నుండి విలేజీ గాళ్ పాత్రలోకి మారడం విమర్శకుల నుండి ప్రశంసలను అందుకుంది. బాలీవుడ్‌లో సంజయ్ దత్- అక్షయ్ కుమార్‌లతో కలిసి రాజ్ సిప్పీ 'అమానత్' (1994)లో తెరంగేట్రం చేసింది. అయితే చట్టపరమైన కారణాలతో ఈ చిత్రం విడుదల ఆలస్యం అయింది. 1990ల మధ్యకాలంలో హీరా తమిళంలో బాలు మహేంద్ర 'సతీ లీలావతి'..అగతియన్ కాదల్ కొట్టై వంటి చిత్రాలలో నటించింది. విమర్శకుల ప్రశంసలు..వాణిజ్యపరమైన విజయాలతో కెరీర్ ని నిర్మించుకుంది. అయితే 1999లో హీరా అకస్మాత్తుగా తెరకు దూరమైంది. తనలోని కళాత్మక సమగ్రతను నిలబెట్టుకోవాలనే కోరికతో చిత్ర పరిశ్రమ నుండి వైదొలగాలని హీరా నిర్ణయించుకుంది. తన మనసుకు నచ్చని, తనలోని సున్నితత్వానికి అనుగుణంగా లేని పాత్రలకు దూరంగా ఉంది. ఆమె చివరిగా స్వయంవరం (1999)లో కనిపించింది.
వ్యక్తిగత జీవితంలో, హీరా 2002లో పుష్కర్ మాధవ్‌ను వివాహం చేసుకున్నారు. అయితే 2006లో విడాకులతో ఈ బంధం ముగిసింది.