ఈ సూపర్‌స్టార్ ఆ రకంగా సాటి హీరోలకు స్ఫూర్తి
లేటు వయసులో అద్భుతాలు చేయడం అమితాబ్, చిరంజీవి, రజనీకాంత్ లాంటి అతి కొద్ది మందికే పాజిబుల్.
లేటు వయసులో అద్భుతాలు చేయడం అమితాబ్, చిరంజీవి, రజనీకాంత్ లాంటి అతి కొద్ది మందికే పాజిబుల్. కానీ ఏదో మాయలో పడిపోయి కొందరు సీనియర్ హీరోలు ఎప్పటికీ హీరోలుగానే మిగిలిపోవాలని కలలు గంటూ తమకు ఆదరణ తగ్గిందనే విషయాన్ని గ్రహించడం లేదు. అలాంటి వారికి ఈ సీనియర్ హిందీ హీరో ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
నిజానికి 60 కి కూతవేటు దూరంలోనే ఉన్న హిందీ సూపర్ స్టార్ అక్షయ్ కుమామార్ కొన్ని వరుస పరాజయాలతో సతమతమయ్యాడు. పృథ్వీరాజ్, బడే మియాన్ చోటే మియాన్, సెల్ఫీ , మిషన్ రాణిగంజ్ ఇవన్నీ భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులవ్వడంతో అతడు కుదేలయ్యాడు.
అదే సమయంలో అతడిని అతిథి పాత్రలు ఆదుకున్నాయి. ఇతర హీరోల సినిమాల్లో అతడు అతిథిగా నటించినవన్నీ పెద్ద విజయాలు అందుకోవడం, వాటిలో అతడి పాత్ర వర్కవుట్ కావడంతో ఇప్పుడు అతడిని కామియో కింగ్ అంటూ కీర్తిస్తున్నారు. ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన స్త్రీ 2లో అక్షయ్ అతిథి పాత్ర అందరినీ ఆకట్టుకుంది. అతడి ఎంట్రీ చూసి ఫ్యాన్స్ విజిల్స్ వేసారు. ఇప్పుడు `సింగం ఎగైన్`లో అతడి నటన మళ్లీ అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది. అక్కీ పోలీస్ అవతారం నిజంగా స్టన్నింగ్. అతడి ఎంట్రీ ఆహార్యం ప్రతిదీ మైమరిపించాయి. ముఖ్యంగా 57 వయసులోను అతడి పర్ఫెక్ట్ ఫిట్ లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ విజయాల దృష్ట్యా అతడు మునుముందు మరిన్ని కామియోలు చేసేందుకు ఆస్కారం ఉంది. కేవలం అక్షయ్ మాత్రమే కాదు.. లేట్ ఏజ్ లో ఉన్న సల్మాన్, షారూఖ్ కూడా ఇటీవల అతిథి పాత్రలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇక బాగా డల్ అయిపోయాక తెలివైన దారిలో వెళుతున్న అక్షయ్ కుమార్ స్ఫూర్తితో ఇతర పరిశ్రమల్లోని ఏజ్ బార్ ఫేడవుట్ హీరోలు కామియోలతో కొత్త దారిలో వెళతారేమో చూడాలి.