సినీ ప్రేమికులకు అల్లు సినీప్లెక్స్‌ గుడ్‌ న్యూస్‌

ప్రస్తుతం హైదరాబాద్‌లో అల్లు వారు నిర్మిస్తున్న అల్లు సినీ ప్లెక్స్‌లోని ఒక స్క్రీన్‌ను డాల్బీ టెక్నాలజీతో ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది.;

Update: 2025-04-02 05:21 GMT
సినీ ప్రేమికులకు అల్లు సినీప్లెక్స్‌ గుడ్‌ న్యూస్‌

పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం సినిమా ఇండస్ట్రీ సైతం అందిపుచ్చుకుంటుంది. సినిమా మేకింగ్‌లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. హాలీవుడ్‌ సినిమాలకు వినియోగిస్తున్న టెక్నాలజీని కాస్త ఆలస్యంగా లేదా అటు ఇటుగా ఇండియన్‌ ఫిల్మ్‌ మేకర్స్ సైతం వాడుతున్న విషయం తెలిసిందే. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్స్‌ను అందించేందుకు గాను మేకర్స్ భారీగా ఖర్చు చేస్తూ ఉంటారు. వీఎఫ్‌ఎక్స్ విషయంలోనూ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను మన ఇండియన్ ఫిల్మ్‌ మేకర్స్ అందుకుంటున్నారు. ఎంత అద్భుతంగా సినిమాను తీసినా దాన్ని చూసే స్క్రీన్‌, ఆ స్క్రీన్‌ ఉన్న థియేటర్‌ లేదా మల్టీప్లెక్స్‌ మెయింటెన్స్ ఆధారంగా అనుభూతి ఉంటుంది.

ఒకప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో రాజ్యం ఏలేవి. కానీ ఇప్పుడు అప్పుడప్పుడు సినిమాను చూసినా అద్భుతమైన అనుభూతి తో పాటు, విలాసంగా ఉండాలనే ఉద్దేశంతో మల్టీప్లెక్స్‌లను ప్రేక్షకులు ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. మల్టీప్లెక్స్‌ల్లో ఉండే వసతులు, అక్కడి స్క్రీన్‌ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ కారణంగా సినీ ప్రేమికులు సినిమాను సింగిల్‌ స్క్రీన్‌లో కంటే ఎక్కువగా ఆస్వాదిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఒక సర్వేలో వెల్లడి అయిన విషయం. మల్టీప్లెక్స్‌లు ఎంత విలాసంగా ఉంటే అంతగా టికెట్‌ రేటు ఎక్కువ, సినిమాను ఎంత క్వాలిటీతో చూడాలంటే అంతగా టికెట్‌ రేటు ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. అనుభూతి పొందడం కోసం ప్రేక్షకులు ఎంత రేటు అయినా పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు.

విదేశాలకే పరిమితం అయిన డాల్బీ స్క్రీన్‌లను ఇండియాలోనూ ఏర్పాటు చేసేందుకు డాల్బీ లాబొరేటరీస్ నిర్ణయించుకుంది. అందుకోసం ఇండియాలో ఆరు స్క్రీన్స్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయింది. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన సైతం వెలువడింది. ఆరు స్క్రీన్స్‌లో హైదరాబాద్‌లో ఒక స్క్రీన్‌ ను డాల్బీ టెక్నాలజీతో అందుబాటులోకి తీసుకు రాబోతున్నారు. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, పూణే, తిరుచ్చి, కొచ్చి, ఉలిక్కన్‌లో ఈ డాల్బీ స్క్రీన్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. మల్టీ ప్లెక్స్‌ల్లో ఒక్క స్క్రీన్‌ డాల్బీ టెక్నాలజీతో అందుబాటులో ఉంటుంది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో అల్లు వారు నిర్మిస్తున్న అల్లు సినీ ప్లెక్స్‌లోని ఒక స్క్రీన్‌ను డాల్బీ టెక్నాలజీతో ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. డాల్బీ లాబొరేటరీస్ వారితో అల్లు సినీ ప్లెక్స్ ఒప్పందాలు జరిగాయి. హైదరాబాద్‌లో సూపర్ సక్సెస్ అయిన ఏఎంబీను బెంగళూరులో నిర్మిస్తున్న విషయం తెల్సిందే. అందులోనూ ఒక స్క్రీన్‌ను డాల్బీ టెక్నాలజీతో నిర్మించబోతున్నారు. డాల్బీ టెక్నాలజీలో సినిమా చూడాలి అని కోరుకునే వారికి ముఖ్యంగా హైదరాబాద్‌ సినీ ప్రేమికులకు అల్లు సినీ ప్లెక్స్ పెద్ద గుడ్‌ న్యూస్ చెప్పింది. నిర్మాణంలో ఉన్న ఈ మల్టీప్లెక్స్‌ల్లోని ఆ స్క్రీన్స్‌ కోసం ఇప్పటికే అత్యాధునిక పరికరాలను డాల్బీ లాబొరేటరీస్ పంపించిందని తెలుస్తోంది.

డాల్బీ స్క్రీన్స్‌ లో ఉండే ప్రత్యేకతలను ఇప్పుడు చూద్దాం... ప్రీమియం సినిమా అనుభవంతో పాటు, డాల్బీ విజన్ మరియు డాల్బీ అట్మోస్ టెక్నాలజీ కారణంగా ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేస్తారు. డాల్బీ విజన్‌ కారణంగా పిక్చర్ క్వాలిటీ ది బెస్ట్‌గా ఉండటంతో పాటు, కలర్స్‌ మరింత స్పష్టంగా కనిపిస్తాయి. డాల్బీ ఆట్మోస్ సౌండ్ టెక్నాలజీ కారణంగా చుట్టూ ఉన్న సౌండ్‌తో లీనమయ్యే అనుభవం లభిస్తుంది. ఇక సీటింగ్‌లోనూ చాలా వ్యత్యాసం ఉంటుంది. చాలా కంఫర్ట్‌గా సీటింగ్‌ ఉంటుంది, స్క్రీన్‌ నుంచి సీటుకు సరైన కోణం ఉండటం వల్ల ప్రేక్షకులు సౌకర్యవంతంగా చూసే వీలు ఉంటుంది. అందుకే డాల్బీ సిస్టమ్‌ స్క్రీన్స్‌ కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఆరు స్క్రీన్స్‌ ఇండియాలో అందుబాటులో రానున్నాయి. రాబోయే రోజుల్లో ఇండియాలో డాల్బీ టెక్నాలజీ స్క్రీన్స్‌ భారీ ఎత్తున పెరిగే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News