ఏపీ ఎన్నికల్లో టాలీవుడ్ వేలు అవసరమా ?

ఏపీ ఎన్నికల నేపథ్యంలో సినిమా పరిశ్రమ సినీ పెద్దల వెంట గ్రూపులుగా విడిపోయి రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం ఎంతవరకు మేలు చేస్తుందని పరిశీలకులు అంటున్నారు.

Update: 2024-04-27 15:30 GMT

తెలంగాణలో ఎన్నికలప్పుడు తెరమరుగయిన తెలుగు సినిమా ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో బహిారంగంగా తమ మద్దతును ప్రకటిస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు పలికిన మెగా హీరో చిరంజీవి అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, పెందుర్తి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబులను గెలిపించాలని ఓ వీడియో విడుదల చేశారు. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. చిరంజీవి కాంగ్రెస్ లో ఉన్నాడా ? లేడా ? అన్న చర్చ కూడా జరిగింది. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం త్వరలో పిఠాపురంలో ర్యాలీ కూడా నిర్వహించనున్నట్లు సమాచారం.

చిరంజీవి వెంటే ఆయన కుటుంబ సభ్యులు, పలువురు బుల్లితెర నటులు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు పలకడం, ప్రచారం చేయడం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డికి మద్దతు తెలిపాడు. ప్రముఖ రచయిత కోన వెంకట్ జగన్ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నాడు. పోసాని క్రిష్ణమురళి ప్రతి ఎన్నికల ముందు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబును తిట్టడం, జగన్ ను మెచ్చుకోవడం పరిపాటిగా మారింది.

ఇటీవల ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్ కు మిగతా టాలీవుడ్ సినిమా నటులు సహకరించలేదని, సూపర్ స్టార్ కృష్ణ ఎన్ని విమర్శలు చేసినా ఎన్టీఆర్ ఎన్నడూ ఏమీ అనలేదని, అది ఆయన సంస్కారం’’ అని విమర్శలు చేయడం చర్చకు దారితీసింది. పవన్ వ్యాఖ్యలను నటుడు నరేష్ తప్పుపట్టడం జరిగింది. ఈ విషయంలో మహేష్ మౌనంగా ఉండిపోయాడు. అక్కినేని కుటుంబం ఏపీ రాజకీయాల విషయంలో మౌనంగానే ఉన్నది.

ఏపీ ఎన్నికల నేపథ్యంలో సినిమా పరిశ్రమ సినీ పెద్దల వెంట గ్రూపులుగా విడిపోయి రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం ఎంతవరకు మేలు చేస్తుందని పరిశీలకులు అంటున్నారు. రాజకీయాలకు పరిశ్రమ పెద్దలు దూరంగా ఉంటే సినీ పరిశ్రమ భవిష్యత్తుకు మంచిదని, కానీ దాని గురించి ఎవరూ ఆలోచించడం లేదని వాపోతున్నారు. ఏపీ ఎన్నికలలో టాలీవుడ్ నటుల జోక్యం సినిమా పరిశ్రమకు మేలు చేస్తుందా ? కీడు చేస్తుందా ? వేచిచూడాలి.

Tags:    

Similar News