ఐటీకి చిక్కిన 65కోట్లు.. స్టార్ హీరో వాటా ఎంత‌?

Update: 2020-02-06 09:07 GMT
జీఎస్టీ (వ‌స్తు- సేవా ప‌న్ను) అధికారులు సినీ తార‌ల్ని వెంటాడి వేటాడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ గురువారం కోలీవుడ్ స్టార్ హీరో .. ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ పై ఆక‌స్మిక దాడులు నిర్వ‌హించ‌డం సంచ‌ల‌న‌మైంది. ఇక ఈ దాడుల్లో 65 కోట్ల మేర క్యాష్ విజ‌య్ కి స‌న్నిహితుడైన ఫైనాన్షియ‌ర్ అన్బు చెలియ‌న్ వ‌ద్ద‌ ప‌ట్టుబ‌డింది. ఈ సంద‌ర్భంగా ఆ డ‌బ్బుతో విజ‌య్ కి ఉన్న లింకుల‌పైనా ఐటీ అధికారులు ఆరాలు తీసారు. ఆదాయపు పన్ను అధికారులు మధురై లోని ఎజిఎస్ సినిమాస్ స‌హా ఫిల్మ్ ఫైనాన్షియర్ అన్బు చెలియన్ ఆస్తులపై ఆరాలు తీసారు. పన్ను ఎగవేత కేసులో విజయ్ ను ఈ సంద‌ర్భంగా ప్రశ్నించారు. చెన్నైలోని విజయ్ ఇంటిని జ‌ల్లెడ ప‌ట్టారు. ఈ దర్యాప్తు లో అన్బు చెలియన్ - విజయ్ మధ్య లెక్కలేనన్ని లావాదేవీలు జరిగాయని తేల‌గా.. ఆ వెంట‌నే చెన్నై ఔట్ స్క‌ర్ట్స్ లోని ఈస్ట్ కోస్ట్ రోడ్ లోని విజ‌య్ ఇంటి పైనా ఐటీ దాడి జరిగింది. విజయ్‌ ను శుక్ర‌వారం (ఈ రోజు) కూడా ఐటీ అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు.

AGS సినిమాస్ గత ఏడాది విజయ్ నటించిన సూపర్ హిట్ చిత్రం బిగిల్ ను నిర్మించింది. AGS గ్రూప్ ఆ సంస్థ అనుబంధ‌ ఫైనాన్షియర్ చిత్రాలకు సంబంధించి కొంతకాలంగా ఐటీ వాచ్ చేస్తోంద‌ని ఓ అధికారి వెల్ల‌డించారు. అయితే విజ‌య్ తో పొలిటిక‌ల్ రైవ‌ల్రీ నేప‌థ్యం లో కేంద్రంలోని భాజ‌పా ఈ దాడులు చేయించింద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఐ చంద్రశేఖర్ కుమారుడు విజయ్ రాజకీయం గా యాక్టివ్ అవుతుండ‌డమే ఇందుకు కార‌ణ‌మ‌ని ద‌ళ‌ప‌తి అభిమానులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

త‌న సినిమాల్లో వస్తు- సేవల పన్ను (జిఎస్‌టి) ను విమర్శిస్తూ.. నోట్ల నిషేధాన్ని విమర్శించిన డైలాగ్ లు చెప్పినందుకే విజ‌య్ కి ఈ శిక్ష‌. తమిళనాడులోని బిజెపి- అధికార ఎఐఎడిఎంకె 2017 అక్టోబర్ లో విడుదల చేసిన మెర్సల్ చిత్రంలోని ప‌లు స‌న్నివేశాల్ని.. డైలాగుల్ని తీవ్రంగా వ్యతిరేకించాయి.

జీఎస్టీ అమ‌లైన‌ తరువాత.. దానికి అదనంగా స్థానిక సంస్థల పన్ను విధించడాన్ని నిరసిస్తూ తమిళనాడులోని సుమారు 1000 సినిమా హాళ్ళు రోజుల తరబడి మూసివేసిన సంగ‌తి తెలిసిందే. దీని వెన‌కా విజ‌య్ ఆయ‌న తండ్రి ప్రోద్భ‌లం ఉంద‌న్న అనుమానాలు భాజ‌పాకు ఉన్నాయన్న గుస‌గుస వినిపించింది.

ఇక ఐటీ సోదాల్లో భాగంగా విజ‌య్ ని కడలూరు జిల్లాలోని షూటింగ్ ప్రదేశం నుండి చెన్నైకి తీసుకెళ్లారనే ప్ర‌చారాన్ని అధికారులు ఖండించారు. ``విజ‌య తో మేం చాలా మర్యాద పూర్వకంగా న‌డుచుకున్నాం. ఐటీ సోదాలు జ‌రిగేప్పుడు విజయ్ భార్య త‌న‌ని ఇంటికి పంపాల‌ని కోరారు. అతను ఒక పెద్ద స్టార్ అని మాకు తెలుసు. మా సీనియర్ అధికారులు చాలా మర్యాదగా వ్యవహరించమ‌ని మ‌మ్మ‌ల్ని ఆదేశించారు`` అని ఓ అధికారి తెలిపారు. తమిళనాడు వ్యాప్తంగా 38 చోట్ల నిన్న ఒక్క‌ రోజులోనే ఐటీ దాడులు జరిగాయి. పూర్తి ఆధారాలు సేక‌రించాకే ఈ దాడులు జ‌రిగాయ‌ని .. ఇందులో రాజకీయంగా పెడార్థాలు తీయాల్సిన ప‌నే లేద‌ని ఆదాయపు పన్ను శాఖ‌ అధికారులు అంటున్నారు. అయితే ఐటీ అధికారుల‌కు 65 కోట్లు ప‌ట్టుబ‌డ్డాయి అని అంటున్నారు కాబ‌ట్టి ఆ డబ్బుతో విజ‌య్ కి ఉన్న లింకు ఏమిటో అధికారులే చెప్పాల్సి ఉంటుంది.
Tags:    

Similar News