శాతకర్ణిని వక్రీకరించారంటున్నారు

Update: 2017-01-14 08:57 GMT
తెలుగువాడి కీర్తి పతాకాన్ని శతాబ్దాల క్రితమే చాటి చెప్పిన గౌతమి పుత్ర శాతకర్ణిను అందరికి సుపరిచితుడ్ని చేయటమే కాదు.. అతగాడి వీరత్వాన్ని వెలుగులోకి తెచ్చిన ఘనత దర్శకుడు క్రిష్.. హీరో బాలకృష్ణకు మాత్రమే దక్కుతుందనటంలో తప్పు లేదు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ సినిమా విడుదల కావటం.. పాజిటివ్ రెస్పాన్స్ రావటం తెలిసిందే.

ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమాపైన విమర్శనాస్త్రాల్ని ఎక్కు పెట్టారు పలువురు చరిత్రకారులు. తాజాగా కొందరు చరిత్రకారులతో కూడిన బృందం ఒకటి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి.. ఈ సినిమాను తప్పు పట్టారు. తెలంగాణ చరిత్రను.. ఇక్కడి కళాకారుల్నిప్రోత్సహించేది పోయి చరిత్రను వక్రీకరించిన సినిమాకు వినోద పన్ను రాయితీ ఇవ్వటం సరికాదని మండిపడుతున్నారు.

సినిమాలో చెప్పినట్లుగా శాతకర్ణి కోటి లింగాలలో జన్మించలేదని.. అతని తల్లి నాసిక్ లో వేయించిన శిలాశాసనంలో ఆ విషయాన్ని ఎక్కడా పేర్కొనలేదని వారు చెబుతున్నారు. శాతకర్ణి భారతదేశం మొత్తాన్ని పాలించినట్లు చూపిస్తున్నారని..కానీ.. పశ్చిమ దక్కన్ పీఠభూమి మాత్రమే శాతకర్ణి అధీనంలో ఉందని చెప్పారు.

ఇండో గ్రీకు రాజు అయిన డిమిట్రిస్ తో శాతకర్ణి యుద్ధం చేసినట్లుగా చెప్పటం చారిత్రక అసత్యమని..డిమిట్రీస్ క్రీస్తుపూర్వం 312కు చెందిన వాడని.. శాతకర్ణి క్రీస్తు పూర్వం 390 సంవత్సరానికి చెందిన వాడని.. వారి మధ్య చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న శాతకర్ణికి వినోదపన్ను రద్దు చేయాలని.. తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని గండి కొట్టటంలో అర్థం లేదన్న డిమాండ్ ను వినిపించారు. సినిమాలో చరిత్రను వక్రీకరిస్తే.. ఆ విషయాన్ని వీలైనంత ఎక్కువగా ఫోకస్ చేసి.. వాస్తవాల్ని ప్రజలకు చెప్పాల్సింది పోయి.. ఎంతసేపటికి ప్రభుత్వం రద్దుచేసిన రాయితీపన్ను మీదనే.. అదే పనిగా గుర్తు చేయటంలో అర్థమేమిటంటారు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News