ఏపీలో వారం పాటు 'సైరా'కు స్పెషల్‌ పర్మీషన్‌

Update: 2019-10-01 16:00 GMT
ఈమద్య కాలంలో సినిమా బడ్జెట్‌ లు భారీగా పెరుగుతున్న కారణంగా మొదటి వారం రెండు వారాల్లోనే బడ్జెట్‌ ను రికవరీ చేసుకునేందుకు ఎక్కువ థియేటర్లలో సినిమాలను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కువ థియేటర్లతో పాటు రెగ్యులర్‌ గా పడే షోలతో పాటు మరో రెండు షోలు కూడా అధనంగా వేసుకునేందుకు పర్మీషన్స్‌ తీసుకుంటున్నారు. రేపు విడుదల కాబోతున్న సైరా చిత్రంకు ఏపీ ప్రభుత్వం ఆ ప్రత్యేక షోలకు అనుమతులు మంజూరు చేసింది.

ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా మద్యరాత్రి 1 నుండి ఉదయం 10 గంటల వరకు ప్రత్యేక షోలకు అనుమతించడం జరిగింది. కొణిదెల ప్రొడక్షన్స్‌ వారి అభ్యర్థన మేరకు ఈ అనుమతిని ఇస్తున్నట్లుగా ఏపీ హోం శాఖ ముఖ్య కార్యదర్శి పేర్కొన్నారు. ప్రత్యేక అనుమతి లభించడంతో ఏపీలో నేడు అర్ధరాత్రి నుండే షోలు పడే అవకాశం ఉంది. మొదటి వారం రోజుల పాటు అంటే అక్టోబర్‌ 2 నుండి అక్టోబర్‌ 8 వరకు ఈ ప్రత్యేక షోలకు అనుమతి ఇస్తున్నట్లుగా హోం శాఖ విడుదల చేసిన నోట్‌ లో పేర్కొనడం జరిగింది.

ఇటీవల విడుదలైన సాహో చిత్రంకు కూడా ప్రత్యేక షోలకు అనుమతి లభించింది. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వస్తే ఈ ప్రత్యేక షోల వల్ల కలెక్షన్స్‌ భారీగా వస్తాయి. సైరాకు ఉన్న క్రేజ్‌ కారణంగా ఏపీలో గత రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. బాహుబలి రికార్డులను టార్గెట్‌ చేస్తూ బరిలోకి దిగబోతున్న సైరా నరసింహారెడ్డి ఏమేరకు సక్సెస్‌ అయ్యేనో చూడాలి. ఏపీలో ప్రత్యేక షోలకు అనుమతులు దక్కాయి.. తెలంగాణలో కూడా ప్రత్యేక షోల కోసం అనుమతులు కోరడం జరిగింది. కాని ఇప్పటి వరకు ఎలాంటి స్పందన అయితే రాలేదు.
Tags:    

Similar News