#టికెట్ పెంపు.. హైకోర్టులో `వకీల్ సాబ్`‌కు ఊర‌ట‌

Update: 2021-04-10 03:49 GMT
వ‌కీల్ సాబ్ రిలీజ్ ముందు ఆంధ్ర ప్ర‌దేశ్ లో మెలోడ్రామా గురించి తెలిసిన‌దే. స్పెష‌ల్ షోల అనుమ‌తుల్ని టికెట్ ధ‌ర‌ల పెంపును ర‌ద్దు చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఆక‌స్మికంగా ఉత్త‌ర్వులు జారీ చేయ‌డం అనంత‌రం జాయింట్ క‌లెక్ట‌ర్లు నేరుగా థియేట‌ర్ య‌జ‌మానులు పంపిణీదారుల‌ను హెచ్చ‌రిస్తూ నోటీసులు ఇవ్వ‌డం తెలిసిన‌దే. ఈ ఆక‌స్మిక ప‌రిణామానికి ప‌వ‌న్ అభిమానులు షాక్ తిన్నారు. అప్ప‌టికే అమ్మ‌కాలు సాగించిన టిక్కెట్ డ‌బ్బుల్ని వెన‌క్కి ఇస్తామ‌ని థియేట‌ర్ య‌జ‌మానులు అన‌డంతో ప‌వ‌న్ అభిమానుల్లోనూ క‌న్ఫ్యూజ‌న్ ఎదురైంది.

నిజానికి టికెట్ పెంపున‌కు.. స్పెష‌ల్ షోల‌కు అనుమ‌తించిన ప్ర‌భుత్వం ఆక‌స్మికంగా అలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డాన్ని రాజ‌కీయ క‌క్ష‌గానే భావించారు ప‌వ‌న్ అభిమానులు. ఆ నిర్ణ‌యంపై  జ‌న‌సైనికుల నుంచి తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్త‌మైంది. అనంత‌రం థియేట‌ర్ల ముందు గ‌డ‌బిడ ఉద్రిక్త వాతావ‌ర‌ణం తెలిసిన‌దే.

తాజాగా ఏపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా హైకోర్టు తీర్పు వెలువ‌రించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వకీల్ సాబ్ నిర్మాత‌లు.. పంపిణీ ఎగ్జిబిష‌న్ వ‌ర్గాల‌కు అభిమానులకు పెద్ద ఉపశమనం కలిగిస్తూ..  టికెట్ ధరను పెంచుకోవ‌డానికి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొత్త ఆర్డర్ మేర‌కు థియేటర్ యజమానులు టికెట్ రేటును మూడు రోజులు పెంచుకునే వెసులుబాటును కోర్టు క‌ల్పించింది. ఈ విషయంలో 13 జిల్లాల జాయింట్ కలెక్టర్లకు.. ఏపీ ప్రభుత్వానికి కూడా హైకోర్టు ఆదేశాలు పంపింది.

నిజానికి జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ పై వైకాపా ప్ర‌భుత్వం రాజ‌కీయ క‌క్ష‌కు పాల్ప‌డింద‌ని జ‌న‌సైనికులు ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. కానీ వినియోగ‌దారుల ఫోర‌మ్ .. కోర్టు ఉత్తర్వుల మేర‌కు అధికారులు అలా స్పందించాల్సి వ‌చ్చింద‌ని దీంతో ప్ర‌భుత్వానికి సంబంధం లేద‌ని వైకాపా నాయ‌కులు వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. దానికి ప‌వ‌న్ అభిమానులు సంతృప్తి చెంద‌లేదు. తాజాగా హైకోర్టు ఉత్త‌ర్వుల తో మూడు రోజుల పాటు టికెట్ ధ‌ర‌లు పెంచుకునే వెసులుబాటు క‌లిగింది.  దీనిపై రాష్ట్రంలో మ‌రోసారి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.
Tags:    

Similar News