పుష్ప‌ని భీభ‌త్సంగా పొగిడేసిన బోనీ పుత్ర‌ర‌త్నం!

Update: 2022-01-09 14:30 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కోట్లాదిగా ఫ్యాన్సున్నారు. సెల‌బ్రిటీల్లోనూ అత‌డి డ్యాన్సింగ్ కి న‌ట‌న‌కు గొప్ప అభిమానులున్నారు. బ‌న్ని న‌టించే ప్ర‌తి సినిమాకి స‌మీక్ష‌లు ఇచ్చేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తారు. బ‌న్ని కొత్త తరం నటీనటులకు నిరంతర స్ఫూర్తి. అల్లు అర్జున్ ఎంట్రీ తర్వాత దాదాపు ఒక దశాబ్దం తర్వాత చిత్ర పరిశ్రమకు వచ్చిన బాలీవుడ్ యువ‌హీరో అర్జున్ కపూర్ బ‌న్నీకి తాను ఎంతటి వీరాభిమాని అన్న‌ది చెప్పిన తీరు ఆస‌క్తిక‌రం.

పుష్ప: ది రైజ్ వీక్షించిన అత‌డు చాలా ఎమోష‌న‌ల్ అయ్యి త‌న అభిమానాన్ని స్పెష‌ల్ నోట్ లో రాసుకొచ్చారు. నిర్మాత బోనీక‌పూర్ కుమారుడు అర్జున్ కపూర్ బన్నీని పొగ‌డ్త‌ల్లో ముంచెత్తారు. తన ఇన్‌స్టాగ్రామ్ లో ఫ్యాన్ బాయ్ క్షణాన్ని వ్యక్తీకరించడానికి పుష్ప  స్టిల్ ను షేర్ చేసిన అర్జున్ క‌పూర్ ``ఆర్య బ్లాక్ బస్టర్ సినిమా నుంచి బన్నీకి వీరాభిమానిని`` అని చెప్పాడు. ``పుష్ప సినిమా కాదు. ఇది ఒక అనుభవం.. అత‌డి వైఖరిలో సీరియ‌స్ నెస్ కూల్ నెస్.. ఒక మృధువైన కవితలా సినిమా ఉంది. అల్లు అర్జున్ నాకు ఇన్నాళ్లూ ఆర్యనే .. అభిమానిగా ఆర్య నుండి పుష్ప వరకు అతనిని చూడటం చాలా అద్భుతంగా అనిపించింది... పుష్ప ఒక పువ్వు కాదు అది నిప్పు... పెద్ద స్క్రీన్ పై అతని కళ్లు క‌ణ‌క‌ణ మండుతున్నాయి`` అని పోస్ట్ చేసాడు. పుష్ప చిత్రం అత‌డికి ఎంత‌గా న‌చ్చిందో దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.

అర్జున్ క‌పూర్ అభిమానానికి అత‌డి మాటలకు బన్నీ ఎంతగానో క‌రిగిపోయాడు. అతను అర్జున్ షేర్ చేసిన స్టోరీని మళ్లీ అభిమానుల‌తో పంచుకున్నాడు. అతనికి ధన్యవాదాలు తెలిపాడు - ``ఇలాంటి హృదయపూర్వకమైన మంచి మాటలకు చాలా ధన్యవాదాలు. మీరు అగ్నిని అనుభవించినందుకు ఉప్పొంగాను .. అందరి ప్రేమకు ధన్యవాదాలు... స‌వినయంగా`` అంటూ రిప్ల‌య్ ఇచ్చాడు బ‌న్ని. అల్లు అర్జున్ డ్యాన్సుల‌కు బాలీవుడ్ ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ల‌తో పాటు స్టార్ హీరోలు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు కూడా ప్ర‌శంస‌లు కురిపించిన సంద‌ర్భాలున్నాయి.
Tags:    

Similar News