నాగ చైతన్య కోసం రామ్ చరణ్ విలన్.. వంటలక్క కూడా..!

Update: 2022-10-14 10:46 GMT
అక్కినేని నాగ చైతన్య హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ తెలుగు-తమిళ బైలింగ్విల్ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. NC22 అని తాత్కాలికంగా పేరు పెట్టబడిన ఈ చిత్రం ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. ఇది అక్కినేని యువసామ్రాట్ కెరీర్‌ లోనే అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటి. ఇటీవలే ఈ సినిమాలో భాగమైన టెక్నికల్ టీమ్ ను మేకర్స్ ప్రకటించారు. అయితే ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ ని మరింత పెంచడానికి ఈ రోజు మొత్తం తారాగణాన్ని పరిచయం చేసారు.

NC22 సినిమాలో నాగచైతన్య సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మిగతా ప్రధాన పాత్రల్లో కనిపించే నటీనటులను శుక్రవారం ఉదయం నుంచీ మేకర్స్ వరుస అప్‌డేట్‌ లతో ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ లో అద్భుతమైన పాత్రలతో మెప్పించిన సుప్రీమ్ టాలెంటెడ్ యాక్టర్ అరవింద్ స్వామి కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. రామ్ చరణ్ 'ధృవ' చిత్రంలో ప్రతినాయకుడిగా నటించిన అరవింద్ స్వామీ చాలా గ్యాప్ తర్వాత చైతూ కోసం విలన్ గా మారుతున్నారని తెలుస్తోంది.  

అలానే తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ మరియు జాతీయ అవార్డు విన్నింగ్ నటి ప్రియమణి శక్తివంతమైన పాత్రలు పోషిస్తున్నారని పేర్కొన్నారు. కోలీవుడ్ కమెడియన్ ప్రేమ్‌ జీ అమరన్ - వెన్నెల కిషోర్ నవ్వించే బాధ్యత తీసుకోగా.. విలక్షణ నటుడు సంపత్ రాజ్ ఈ సినిమాలో భాగం అవుతున్నారు. 'కార్తీక దీపం' సీరియల్ తో  'వంటలక్క'గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రేమి విశ్వనాథ్ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది. తమిళ హీరో జీవా అతిథి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

నాగచైతన్య డెబ్యూ తమిళ్ మూవీ కోసం అద్భుతమైన ప్రతిభావంతులైన నటీనటులను తీసుకోవడం అభిమానులను మరియు ప్రేక్షకులను ఆనందపరుస్తోంది. ఇందులో చైతూ ఒక పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఫ్యాన్స్ కోరుకునే మాస్ అండ్ యాక్షన్ అంశాలతో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ లో బిజీగా ఉన్న మేకర్స్.. రానున్న రోజుల్లో మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ అవ్వడానికి రెడీ అవుతున్నారు.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ ని పవన్‌కుమార్‌ సమర్పించనున్నారు. లెజెండరీ తండ్రీ కొడుకులు మాస్ట్రో, ఇసైజ్ఞాని ఇళయరాజా మరియు లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి పాటలను ట్యూన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

అబ్బూరి రవి డైలాగ్స్‌ రాస్తుండగా.. ఎస్‌ఆర్‌ కతిర్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్ గా.. డివై సత్యనారాయణ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. యాన్నిక్ బెన్ - మహేష్ మాథ్యూ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తుండగా.. వెంకట్ రాజన్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News