బాలయ్య NBK107 చిత్రంతో వైఎస్సార్సీపీని టార్గెట్ చేస్తున్నారా..?

Update: 2022-06-10 06:39 GMT
నేడు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని నిన్న గురువారం సాయంత్రం #NBK107 టీజర్ ను రిలీజ్ చేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహం నటిస్తున్న సినిమా ఇది. వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ అని మేకర్స్ చెబుతున్నారు.

బాలయ్య మార్క్ పవర్ ఫుల్ డైలాగ్స్ తో కూడిన పవర్ ప్యాక్డ్ మాస్ టీజర్ నందమూరి ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. అదే సమయంలో ఇందులో బాలకృష్ణ పలికిన డైలాగ్స్ చర్చనీయాంశంగా మారాయి. ఇవి నేరుగా అధికార ఆంధ్రప్రదేశ్ లోని అధికారిక వైఎస్సార్‌సీపీ పార్టీని టార్గెట్ చేసే విధంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

టీజర్‌ లో శత్రువులను చితక్కొట్టి ఒక తోరణానికి వేలాడాదీసిన బాలకృష్ణ.. ఒక కిలోమీటర్ రాయిపై కూర్చున్నట్లు చూపబడింది. దానిపై 'పులిజర్ల' అని రాయబడి ఉండటాన్ని గమనించవచ్చు. ఇది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న 'పులివెందుల' అసెంబ్లీ నియోజకవర్గాన్ని పోలి ఉంది.

అందులోనూ 'మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్.. నా జీవో గాడ్స్ ఆర్డర్' అనే డైలాగ్ ని బట్టి సినిమాలో బాలకృష్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడనేది అర్థం అవుతుంది. అలానే 'భయం నా బయోడేటాలోనే లేదురా బోషిడికే' అనే డైలాగ్ కూడా రాజకీయ భావాలను ప్రతిబింబిస్తోంది.

ఆ మధ్య జగన్ ను ఉద్దేశిస్తూ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి మీడియా సమావేశంలో 'బోషిడికే' అని ఉపయోగించడం ఆంధ్రా రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. సీఎం పై అనుచిత పదజాలం వాడినందుకు పట్టాభిని అరెస్టు చేసి జైలులో కూడా పెట్టారు.

అలాంటి పదాన్ని ఇప్పుడు బాలయ్య పలకడం హాట్ టాపిక్ అయింది. వేరే హీరో అనుంటే దాన్ని పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ.. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఈ డైలాగ్ చెప్పడం వివాదాస్పదం అవుతోంది.

గతంలో కూడా బాలకృష్ణ నటించిన కొన్ని చిత్రాల్లోని డైలాగ్స్ విషయంలో ఇలానే అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. 'అఖండ' సినిమాలో 'శీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి.. నీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉందిరా' అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ మాజీ మంత్రి నాని ని ఉద్దేశించి చెప్పిందే అని అందరూ కామెంట్స్ చేశారు.

ఇప్పుడు NBK107 సినిమాలో బాలకృష్ణ నుంచి వచ్చిన డైలాగ్స్.. వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని చెప్పారని నెటిజన్లు అంటున్నారు. టీజర్ తోనే ఇలా ఉంటే.. సినిమా రిలీజ్ అయిన తరువాత ఇంకెంత రచ్చ జరుగుతుందో అని కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News