ఆ నలుగురిలో ఆ ఒక్కరే బంపర్ హిట్టు!
దీపిక పదుకొనే తర్వాత మళ్లీ ఆ స్థాయిని అందుకున్న ఏకైక బ్యూటీ.
బాలీవుడ్‌లో ఆలియా భట్ స్టార్ డమ్ అసాధారణ స్థాయికి చేరుకుంది. జయాపజయాలతో పని లేకుండా స్టార్ డమ్ ని కొనసాగించే స్థాయి ఆలియాకు ఉంది. దీపిక పదుకొనే తర్వాత మళ్లీ ఆ స్థాయిని అందుకున్న ఏకైక బ్యూటీ. కానీ ఈ ఏడాదిలో ఆలియా నటించిన 'జిగ్రా' తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. వసంత బాలన్ తెరకెక్కించిన ఈ సినిమా బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కింది. అయితే వీక్ నేరేషన్ కారణంగా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ఆలియా నటప్రతిభ కూడా బాక్సాఫీస్ వద్ద ఆదుకోలేదు. ఈ చిత్రంలో వేదాంగ్ రైనా ఆలియాకు సోదరుడిగా నటించాడు. అప్ కమ్ హీరోకి ఇది నిరాశాజనక ఫలితం.
అయితే ఆలియా తర్వాత వెండితెరపై వేగంగా దూసుకొస్తున్న కథానాయికల జాబితాను పరిశీలిస్తే .. ఇందులో ముగ్గురు నటవారసురాళ్లు కూడా ఉన్నారు. ఆ ముగ్గూరు ఎవరో కాదు.. జాన్వీ కపూర్, సారా అలీఖాన్, అనన్య పాండే. 2024లో ఈ ముగ్గురు క్రేజీ భామలు బాక్సాఫీస్ వద్ద అదృష్టం పరీక్షించుకోగా, వారిలో ఒక్కరు మాత్రమే ఆశించిన బాక్సాఫీస్ విజయాన్ని దక్కించుకోగలిగారు. సైఫ్ ఖాన్ నటవారసురాలు సారా అలీఖాన్ నటించిన జర హట్కే జర బచ్చే బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం 116 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో సారా సరసన విక్కీ కౌశల్ కథానాయకుడిగా నటించాడు. సారా ఈ ఏడాది హిట్టు కొట్టి మాంచి జోష్ తో కొత్త సంవత్సరానికి వెల్ కం చెబుతోంది.
ఇదే ఏడాది మరో నటవారసురాలు జాన్వీ కపూర్ రెండు సినిమాల్లో నటించింది. మిస్టర్ అండ్ మిసెస్ మాహి, ఉలఘ్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద అదృష్టం పరీక్షించుకుంది. కానీ ఈ రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. తన సినిమాలు బాగా ఆడేందుకు జాన్వీ ప్రచారంలోను దూకుడు ప్రదర్శించినా ఏదీ కలిసి రాలేదు. మిస్టర్ అండ్ మిసెస్ మాహి ప్రచారం కోసం ధోని పేరు ఉపయోగించుకున్నా అది కలిసి రాలేదు. ఇందులో రాజ్ కుమార్ రావు కీలక పాత్ర పోషించారు. అలాగే ఉలఝ్ చిత్రంలో గుల్షన్ దేవయ్య కథానాయకుడిగా నటించాడు. ఈ రెండు సినిమాల పరాజయం జాన్వీని పూర్తిగా ఆలోచనలో పడేశాయి. బాలీవుడ్ లో ఆశించిన హిట్టు పడక జాన్వీ నిరాశపడింది. ఇక ఎన్టీఆర్ సరసన 'దేవర' లాంటి బ్లాక్ బస్టర్‌లో జాన్వీ నటించినా కానీ, తన పాత్రకు పరిధి చాలా పరిమితం అని విమర్శలొచ్చాయి.
మరోవైపు ఆదిత్యా రాయ్ కపూర్ నుంచి విడిపోయిన అనన్య పాండే తిరిగి కెరీర్ పై శ్రద్ధ పెడుతూ ఈ ఏడాది రెండు వరుస చిత్రాల్లో నటించింది. అనన్య పాండే నటించిన 'కంట్రోల్' (సిటి ఆర్.ఎల్) నెట్ ఫ్లిక్స్ లో విడుదల కావడంతో ఇక థియేట్రికల్ గా మాట్లాడుకోవడానికేమీ లేదు. అక్షయ్ కుమార్, తాప్సీ లాంటి తారలతో తెరకెక్కిన మల్టీస్టారర్ 'ఖేల్ ఖేల్ మే' చిత్రంలోను అతిథిగా నటించింది. కానీ తన పాత్ర పరిధి అంతంత మాత్రమే. అందువల్ల అనన్యకు ఈ ఏడాది అంతగా కలిసొచ్చిన సంవత్సరం కాదు. ఆ ముగ్గురు నటవారసురాళ్లలో సారా అలీఖాన్ మాత్రమే సోలోగా ఆశించిన పెద్ద హిట్టందుకుంది.