తెరమీదకు 'భీమ్లా నాయ‌క్' వివాదం..!

Update: 2022-02-08 06:52 GMT
ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతోన్న క్రేజీ మల్టీస్టారర్ లలో ''భీమ్లా నాయక్'' మూవీ ఒకటి. ఇందులో పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నారు. ఇది మలయాళ బ్లాక్ బస్టర్ 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రానికి అధికారిక రీమేక్ అనే సంగతి తెలిసిందే. అయితే త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా విషయంలో లేటెస్టుగా ఓ వివాదం బయటకు వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. పృథ్వీరాజ్ సుకుమారన్ - బిజూ మీనన్ ప్రధాన పాత్రల్లో సచి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'అయ్యప్పనుమ్ కోషియమ్'. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చారు. మంచి పాటలతో పాటుగా అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ అందించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు జేక్స్. ఇప్పుడు తెలుగు వెర్షన్ 'భీమ్లా నాయక్' చిత్రానికి ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇప్పటి వరకు 'భీమ్లా నాయక్' సినిమా నుంచి వచ్చిన అన్ని పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇందులో కొన్ని ట్యూన్స్ ని థమన్ మలయాళ మాతృక నుంచే తీసుకున్నారని సాంగ్స్ విన్న ఎవరికైనా అర్థం అవుతుంది. అయితే ఇక్క‌డ అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే 'ఏకే' ట్యూన్ ని మక్కీకి మక్కీ దించేసిన తమన్.. ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజాయ్ కి క్రెడిట్ ఇవ్వకపోగా.. క‌నీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్ప‌లేద‌ట.

దీంతో జేక్స్ బాగా హ‌ర్ట్ అయ్యాడట. అంతేకాదు త్వ‌ర‌లోనే ఈ విష‌యాన్ని ఐపిఆర్ఎస్ దృష్టికి తీసుకువెళ్ల‌డానికి మలయాళ మ్యూజిక్ డైరక్టర్ రెడీ అవుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజానిజాలు తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. సాధారణంగా ఒక భాషలోని ట్యూన్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నప్పుడు వారికి కృతజ్ఞతలు తెలుపుతుంటారు. మరి 'భీమ్లా నాయక్' టైటిల్స్ తో మాతృక సంగీత దర్శకుడికి క్రెడిట్ ఇస్తారో లేదో చూడాలి.

మలయాళంలో బిజీ కంపోజర్ గా కొనసాగుతున్న జేక్స్ బిజోయ్.. తెలుగులో 'టాక్సీవాలా' 'చావు కబురు చల్లగా' వంటి సినిమాలకు సంగీతం అందించారు. ప్రస్తుతం శర్వానంద్ నటించిన ద్విభాషా చిత్రం 'ఒకే ఒక జీవితం' సినిమాకు వర్క్ చేస్తున్నారు. అలానే గోపీచంద్ - మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'పక్కా కమర్షియల్' చిత్రానికి జేక్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇకపోతే 'భీమ్లా నాయక్' చిత్రాన్ని ఫిబ్రవరి 25న లేదా ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రీమేక్ అయినప్పటికీ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మాతృక స్క్రిప్ట్ లో అనేక మార్పులు చేర్పులు చేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని స్టార్ డమ్ ని దృష్టిలో పెట్టుకొని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని.. అదనంగా కొన్ని సాంగ్స్ మరియు ఫైట్స్ ని జత చేశారు. ఒరిజినల్ వెర్షన్ తో పోల్చుకుంటే రన్ టైం చాలా తగ్గిస్తున్నట్లు టాక్.

పట్టుదల గల పోలీసు అధికారి - మాజీ సైనికాధికారి మధ్య అహం ఆత్మాభిమానం నేపథ్యంలో జరిగిన వైరాన్ని 'భీమ్లా నాయక్' సినిమాలో చూపించబోతున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ కు జోడీగా నిత్యా మీనన్.. రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రావు రమేష్ - మురళీశర్మ - సముద్ర ఖని - రఘుబాబు - నర్రా శ్రీను - కాదంబరి కిరణ్ - చిట్టి - పమ్మి సాయి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
Tags:    

Similar News