'డ్రైవింగ్ లైసెన్స్' రీమేక్ సంగతేంటి చరణ్?

Update: 2022-01-13 04:37 GMT
ఈ మధ్య కాలంలో తెలుగు తెరపై మలయాళ కథలు రాజ్యం చేస్తున్నాయి. మలయాళ కథలను తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వాస్తవానికి దగ్గరగా అనిపించే ఒక చిన్న పాయింట్ నుంచి వాళ్లు కథను బయటికి తీస్తారు. సహజత్వానికి దగ్గరగా .. ఆసక్తికరంగా ఆ కథను అల్లుతారు. పాత్రలు .. బడ్జెట్ కూడా చాలా పరిమితంగా ఉంటూ ఆ కథలు అక్కడ భారీ విజయాలను అందుకుంటూ ఉంటాయి. అందువలన టాలీవుడ్ స్టార్ హీరోలు ఆ కథల పట్ల మనసు పడుతున్నారు .. మక్కువ చూపుతున్నారు.

మలయాళంలో 2019లో వచ్చిన సినిమాల్లో 'డ్రైవింగ్ లైసెన్స్' పెద్ద హిట్. కేవలం 4 కోట్లతో నిర్మించిన ఈ సినిమా అక్కడ 30 కోట్లను వసూలు చేసింది.  జీన్ పాల్ లాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, పృథ్వీరాజ్ సుకుమారన్ - సూరజ్ వెంజరమ్మూడు ప్రధానమైన పాత్రలను పోషించారు. ఒక సినిమా హీరోకి .. మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ కి మధ్య ఇగో క్లాషెస్ చుట్టూ ఈ కథ నడుస్తుంది. మొదటి నుంచి చివరివరకూ కూడా కథ చాలా పట్టుతో బిగువుగా సాగుతుంది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనే ఉద్దేశంతో చరణ్ రీమేక్ హక్కులను తీసుకున్నాడు. దాంతో చరణ్ ఈ సినిమాను ఎవరితో చేయనున్నాడనే కుతూహలం మెగా అభిమానులలో ఏర్పడింది.

పవన్ కల్యాణ్ - చరణ్ ప్రధానమైన పాత్రలను చేయనున్నట్టుగా ఒక టాక్ వచ్చింది. ఆ తరువాత పవన్ - రవితేజ కథానాయకులుగా ఈ సినిమాను రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకూ ఈ విషయంపై క్లారిటీ లేదు. ప్రస్తుతం చరణ్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు కనుక, మరి ఈ కథ విషయంలో ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నాడనేది చూడాలి. బాలీవుడ్ వాళ్లు మాత్రం ఈ సినిమా రీమేక్ విషయంలో చాలా ఫాస్టుగానే ఉన్నారు. ఈ సినిమా రీమేక్ హక్కులు చేతికి రావడమే ఆలస్యం అందుకు సంబంధించిన కసరత్తును పూర్తి చేశారు. రేపో మాపో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నారు.

బాలీవుడ్ హీరోల్లో రీమేకులు చేయడానికి అక్షయ్ కుమార్ ఎక్కువ ఆసక్తిని చూపుతుంటారు. తెలుగులో రవితేజ మాదిరిగా ఆయనకి సినిమానే లోకం .. సినిమానే సర్వం అన్నట్టుగా చకచకా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతుంటారు. డిక్షనరీలో ఆయనకి నచ్చని ఏకైక పదం గ్యాప్ .. ప్రేక్షకులకు తనకి మధ్య గ్యాప్ రాకండా చూసుకుంటూ ఉంటారు. అక్షయ్ కుమార్ - ఇమ్రాన్ హష్మీ  హీరోలుగా కరణ్ జొహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. రాజ్ మెహతా ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. 'సెల్ఫీ' టైటిల్ తో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక తెలుగులో ఎప్పుడు మొదలవుతుందనేది చూడాలి.     
Tags:    

Similar News