పూరి టైంలో అతడికి సరిగ్గా సగం..

Update: 2017-07-20 16:51 GMT
టాలీవుడ్లో డ్రగ్స్ రాకెట్ కు సంబంధించి సిట్ అధికారుల బృందం దర్యాప్తు రెండో రోజు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది. తొలి రోజైన బుధవారం స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను ఏకంగా పదకొండు గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన అధికారులు.. రెండో రోజు పూరికి సన్నిహితుడైన.. అతడితో అనేక సినిమాలకు పని చేసిన కెమెరామన్ శ్యామ్ కె.నాయుడిని విచారించారు. పూరి విచారణ సమయంలో సరిగ్గా సగం సమయాన్ని శ్యామ్ కోసం కేటాయించారు పోలీసులు.

శ్యామ్ ఉదయం 10 గంటలకు తన న్యాయవాదితో కలిసి వచ్చి సిట్‌ అధికారుల ఎదుట హాజరయ్యారు. డ్రగ్స్‌ మాఫియా కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌తో శ్యామ్‌ సంబంధాలపై సిట్‌ ఆరా తీసినట్లు సమాచారం. ఐతే తనకు సిగరెట్‌ అలవాటే లేదని.. కెల్విన్‌ ఎవరో తనకు తెలియదని శ్యామ్ చెప్పినట్లు తెలుస్తోంది. మీరు డ్రగ్స్ తీసుకున్నారా? మీకు అవి ఎలా అందాయి? కెల్విన్ తో పరిచయం, ఈవెంట్ ఆర్గనైజర్ల వ్యవహారాలు.. డ్రగ్స్ కు సంబంధించి పూరితో ఉణ్న సంబంధాలు.. ఇలా పలురకాల ప్రశ్నలకు సిట్ అధికారులు శ్యామ్ కి సంధించినట్లు సమాచారం. మళ్లీ అవసరమైతే విచారణకు పిలుస్తామని.. అనుమతి లేకుండా హైదరాబాద్ వదిలివెళ్లొద్దని కూడా శ్యామ్ ను అధికారులు కోరినట్లు తెలుస్తోంది. శుక్రవారం నటుడు సుబ్బరాజును సిట్ బృందం విచారణ చేయనుంది.

శ్యామ్ విచారణ పూర్తయ్యాక ఎక్సైజ్‌ కమిషనర్‌ చంద్రవదన్‌ మీడియాతో మాట్లాడారు. విచారణకు శ్యామ్‌ సహకరించినట్లు తెలిపారు. డ్రగ్స్‌ కేసు వ్యవహారం ఆషామాషీ కాదని.. దీన్ని చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. నోటీసులందుకున్నవాళ్లు దర్యాప్తుకు సహకరిస్తే సాధ్యమైనంత త్వరలో విచారణ పూర్తి చేస్తామన్నారు. ఈ కేసుకు సంబంధించి సిట్‌ అధికారులు డీహెచ్‌ఎల్‌.. బ్లూ డార్ట్.. ఫెడెక్స్‌ కొరియర్‌ సంస్థల స్టేట్‌మెంట్లనూ రికార్డు చేశారు. వేరే దేశాల నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ వస్తున్నట్లు విచారణలో తేలిన నేపథ్యంలో కొరియర్ సంస్థల ప్రతినిధులు అధికారులు విచారించారు.
Tags:    

Similar News