ఎట్ట‌కేల‌కు `ప‌ద్మావ‌త్` రిలీజ్ అవుతోంది!

Update: 2018-01-07 09:48 GMT
ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన `ప‌ద్మావ‌తి` చిత్రం విడుద‌లపై దేశవ్యాప్తంగా పెను దుమారం రేగిన‌ సంగ‌తి తెలిసిందే. ఆ సినిమాలో రాణి ప‌ద్మావ‌తి దేవి పాత్ర‌ను వ‌క్రీక‌రించారని రాజ్ పుత్ లో ఆరోపించారు. ఆ సినిమాను నిషేధించాల‌ని డిమాండ్ చేశారు. ‘పద్మావతి’ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ - హీరోయిన్ దీపికా పదుకొణేల‌ తలలపై రూ.10 కోట్ల నజరానా ప్రకటించ‌డ‌మే కాకుండా భ‌న్సాలీ తల న‌రుకుతామ‌ని - దీపికా ముక్కు కోస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు. ఆ సినిమా విడుద‌లైతే శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లుగుతుంద‌న్న ఉద్దేశంతో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ - రాజ‌స్థాన్ - మ‌ధ్య ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రులు అభిప్రాయ‌ప‌డ్డారు. ఆ సినిమా విడుద‌ల‌పై తీవ్ర అభ్యంతారాలు వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో విడుద‌ల‌ను తాత్కాలికంగా వాయిదా వేశారు.

ఎట్ట‌కేల‌కు చ‌రిత్ర‌కారుల క‌మిటీ - సెన్సార్ స‌భ్యులు ...ప‌ద్మావ‌తి సినిమా పేరును ప‌ద్మావ‌త్ గా మార్చ‌డంతో పాటు మ‌రికొన్ని మార్పులు చేయాల‌ని సూచించ‌డంతో ఆ సినిమా విడుద‌ల‌కు మార్గం సుగ‌మ‌మైంది. ఆ మార్పుల‌కు ప‌ద్మావ‌త్ చిత్ర యూనిట్ అంగీక‌రించ‌డంతో ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ బై ఏ సర్టిఫికేట్  ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో ‘పద్మావత్’ ను ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అనేక వివాదాల మ‌ధ్య విడుద‌ల కాబోతోన్న ఈ సినిమాపై ఇప్ప‌టికీ భారీ అంచ‌నాలున్నాయి. అయితే, అదేరోజు అక్షయ్ కుమార్ నటించిన ప్యాడ్ మ్యాన్ రిలీజ్ కాబోతోంది. ఆ సినిమా రిలీజ్ డేట్ ముందుగానే ఫిక్స్ అవ‌డంతో....ప‌ద్మావ‌త్ కు పోటీగా రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యార‌ట‌. ఇన్ని వివాదాల అనంతరం విడుద‌ల‌వుతున్న ప‌ద్మావ‌త్ ...విడుద‌ల త‌ర్వాత రాజ్ పుత్ క‌ర్ణి సేన ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
Tags:    

Similar News