ధనుష్ తెలుగు డైలాగులూ రాసేస్తాడా?

Update: 2017-06-05 09:51 GMT
గతంతో పోలిస్తే తమిళం నుంచి తెలుగులోకి అనువాదాల తాకిడి తగ్గింది. అలాగే తమిళ దర్శకుల మీద మన హీరోల మోజు కూడా బాగా తగ్గింది. ఒక టైంలో ఓవైపు అనువాదాల జోరు సాగుతుంటే.. మరోవైపు చాలామంది తమిళ దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు తీసేవాళ్లు. ఆ కోవలోనే తమిళ స్టార్ డైరెక్టర్ విక్రమన్.. తెలుగులో రెండు సినిమాలు చేశాడు. ఒకటి వెంకటేష్ హీరోగా చేసిన ‘వసంతం’ అయితే.. ఇంకొకటి వేణు కథానాయకుడిగా నటించిన ‘చెప్పవే చిరుగాలి’.

ఈ సినిమాల టైటిల్స్ చూసినా.. పోస్టర్ చూసినా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో పాటుగా ‘మాటలు’ క్రెడిట్ కూడా విక్రమన్‌ కే ఉండటం గమనించవచ్చు. అసలు తెలుగు ఏమాత్రం రాని విక్రమన్ తెలుగులో డైలాగులు రాయడమేంటి అని అందరూ ఆశ్చర్యపోయారు అప్పట్లో. ఐతే విక్రమన్ తమిళంలో డైలాగులు రాసి.. వాటిని ఓ అసిస్టెంట్ ద్వారా తెలుగులోకి అనువదించేవారని.. ఆ రకంగా మాటల క్రెడిట్ కూడా విక్రమనే తీసుకునేవాడని అప్పట్లో చెప్పుకున్నారు.

ఇప్పుడు తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా ఇలాగే చేస్తున్నాడేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న ‘వీఐపీ-2’ సినిమాను తెలుగులోకి కూడా అనువాదం చేస్తున్నారు. ‘రఘువరన్ బీటెక్’కు ఇది సీక్వెల్. ఈ చిత్రానికి కథతో పాటు మాటలు ధనుషే అందిస్తున్నాడు. ఐతే ధనుష్ తమిళంలో డైలాగులు రాసి క్రెడిట్ తీసుకోవడంలో ఎవరికీ ఆశ్చర్యం లేదు.

కానీ ‘వీఐపీ-2’ తెలుగు పోస్టర్ మీద కూడా కథతో పాటు మాటలకు కూడా ధనుష్ పేరే కనిపిస్తుండటం గమనార్హం. మరి ధనుష్ కూడా విక్రమన్ లాగే చేస్తున్నాడా.. లేక పొరబాటున పోస్టర్ మీద అలా అతడి పేరు వేసేశారా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రం జులై 28న తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News