నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది టాలీవుడ్ సినిమాల జాతర
దేశవ్యాప్తంగా ఓటీటీ ప్రేక్షకులు అధికం అయ్యారు. కరోనా తర్వాత ఓటీటీ యూజర్స్ సంఖ్య వందల రెట్లు పెరిగింది.
దేశవ్యాప్తంగా ఓటీటీ ప్రేక్షకులు అధికం అయ్యారు. కరోనా తర్వాత ఓటీటీ యూజర్స్ సంఖ్య వందల రెట్లు పెరిగింది. రెండు మూడు ఏళ్ల క్రితం అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్‌లు మాత్రమే భారతీయ ఓటీటీ ప్రేక్షకులకు ఎక్కువ దగ్గరగా ఉండేవి. కానీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఇండియన్ ఓటీటీ మార్కెట్‌ను దున్నేస్తోంది. భాష ఏదైనా, ఏ పెద్ద హీరో సినిమా అయినా ఎక్కువ శాతం నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్ అవుతోంది. అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఓటీటీ ఖాతాదారులు ఇతర భాషలతో పోల్చితే కాస్త తక్కువ అని చెప్పాలి. అందుకే తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఏడాది మరింత మందిని తమ ఖాతాదారులుగా చేర్చుకునేందుకు గాను నెట్‌ఫ్లిక్స్ పదులకొద్ది సినిమాలను కొనుగోలు చేసింది, చేయబోతుంది.
తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలను ఇప్పటికే కొనుగోలు చేశాం అంటూ నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హీరోగా సాహో సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ సినిమాను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిందట. సినిమా విడుదల అయిన తర్వాత ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయబోతుంది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో థియేటర్ రిలీజ్‌తో పాటు ఓటీటీలోనూ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన దక్కే అవకాశాలు ఉన్నాయి. అందుకే నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అన్ని భాషలకు గాను కొనుగోలు చేసింది.
ఇక విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో రూపొందుతున్న సినిమాను సైతం నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ గెటప్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. కచ్చితంగా సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసం ప్రేక్షకుల్లో ఉంది. అందుకే నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇంకా హిట్ 3ని సైతం నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. నాని హీరోగా రూపొందుతున్న ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు వచ్చిన హిట్ ప్రాంచైజీ రెండు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో హిట్ 3పై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా నాని సినిమా కావడం హిట్ 3 కి కలిసి వచ్చే అంశం.
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన తండేల్ సినిమా పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ రైట్స్ సైతం నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. తండేల్ సినిమాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంకా నెట్ ఫ్లిక్స్‌లో మ్యాడ్ స్క్వేర్, మాస్ జాతర, జాక్, అనగనగా ఒక రాజు సినిమాలను సైతం నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు ఒప్పందాలు జరిగిన సినిమాలు ఇవి. ముందు ముందు మరిన్ని పెద్ద సినిమాలను, ఇతర క్రేజీ సినిమాలను సైతం నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్ లో తెలుగు సినిమాల జాతర కన్ఫర్మ్.