చట్టానికి లొంగిన ఓటీటీ దిగ్గజాలు?
ఓటీటీల్లో అసభ్యకర కంటెంట్ విషయంలో సమాచార ప్రసారాల శాఖ కఠిన వైఖరిని అవలంభిస్తున్న సంగతి తెలిసిందే.
ఓటీటీల్లో అసభ్యకర కంటెంట్ విషయంలో సమాచార ప్రసారాల శాఖ కఠిన వైఖరిని అవలంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకాలం సెన్సార్ షిప్ లాంటి కట్టడి లేకపోవడంతో విచ్ఛలవిడి శృంగారం, రోమాంచిత సన్నివేశాలు యథేచ్ఛగా హల్ చల్ చేసాయి. గగుర్పాటుకు గురి చేసే సన్నివేశాలు, ఇతర రా అండ్ రస్టిక్ కంటెంట్ ని ప్రజలు యథేచ్ఛగా వీక్షించేవారు. అయితే ఇప్పుడు ఇలాంటి రా- కంటెంట్ ని ఇష్టపడే ఆడియెన్ కి రుచించని విధంగా చట్టం రూపాంతరం చెందుతోంది.
భారతదేశంలో విచ్ఛలవిడి కంటెంట్ ప్రదర్శనను ఆపాల్సిన సన్నివేశం ఇప్పుడు ఉంది. ఇలాంటి సమయంలో దిగ్గజ ఓటీటీలు తమ కంటెంట్ ని సెన్సార్ చేసి యువతరం, పిల్లలను తప్పుదారి పట్టించే సన్నివేశాలను తొలగిస్తూ కొంతమేర సాంప్రదాయ ఒరవడికి శ్రీకారం చుడుతున్నాయి. కుల, మతపరమైన అంశాలను కూడా చాలా వరకూ ఎడిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది.
తొలిగా జియో హాట్‌స్టార్ ఈ తరహా ఇనిషియేషన్ తీసుకోవడం ఆసక్తికరం. జియో వేదికగా హెచ్‌బివో, పీకాక్, హులు సహా మరెన్నో అద్భుతమైన కంటెంట్ అందించే చానెల్స్ ఒకే చోట కనిపించేవి. కానీ ఇప్పుడు దేశీ, విదేశీ (హాలీవుడ్) సినిమాలు, వెబ్ సిరీస్ లను సెన్సార్ చేయాలని నిర్ణయించడం పెద్ద షాకింగ్ ట్విస్టుగా మారింది. ప్రస్తుతం కంటెంట్ ని దేశీ ట్రెడిషన్ ప్రకారం ఎడిట్ చేసి అందించేందుకు జియో హాట్ స్టార్ నడుం కట్టింది. కానీ ఇది రా అండ్ రస్టిక్ కంటెంట్ ని ఆస్వాధించే ఓటీటీ ప్రేక్షకులకు ఎంతమాత్రం రుచించడం లేదని సమాచారం.
జియోలోని HBO, పీకాక్ , హులు లో కంటెంట్ ని సెన్సార్ చేసి అందిస్తే అది పూర్తిగా పలుచన అవుతుందని అందరూ ఆరోపిస్తున్నారు.
ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే వెబ్ సిరీస్ లలో కంటెంట్ ని ఎడిట్ చేయడంతో ఇప్పుడు అవన్నీ పలుచన అయిపోయినట్టేనని అభిమానులు భావిస్తున్నారు. హెచ్.బి.వో ఒరిజినల్ కంటెంట్‌ని ఎడిట్ చేయడంతో విపరీతమైన ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గేమ్ ఆఫ్ థ్రోన్స్, ది రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సహా చాలా సిరీస్ లను సెన్సార్ షిప్ పేరుతో ఎడిట్ చేయడంపై ఫ్యాన్స్ తీవ్రంగా గుర్రుమీదున్నారు. ది వైట్ లోటస్ సిరీస్ నుండి బుద్ధుడి గురించిన తప్పుడు ఎపిసోడ్ ని తొలగించారు. నిజానికి జియో హాట్ స్టార్ కంటెంట్ లో మార్పులు చాలామంది ఫ్యాన్స్ కి రుచించడం లేదు. కానీ సమాచార ప్రసారాల శాఖ మార్గదర్శనం ప్రకారం కంటెంట్ లో అనుచితాన్ని, అసభ్యతను, లేదా వక్రీకరించే సన్నివేశాలను ఎడిట్ చేయాల్సి ఉంటుంది. ఇది కేవలం జియో హాట్ స్టార్ వరకే పరిమితం కాదు.. భారతీయ ప్రేక్షకులకు కంటెంట్ అందించే ప్రతి ఓటీటీలోను అమలవ్వాల్సి ఉంటుంది.