హిట్ అయితే అలా..ఫట్ అయితే ఇలా!
కానీ ఈ నిబంధన అన్ని సినిమాలకు కాదు కేవలం హిట్ సినిమాలకే అన్నట్లు కనిపిస్తుంది.
ప్రస్తుతం సినిమాకి ఓటీటీ బిజినెస్ అన్నది అత్యంత కీలకంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో నిర్మాతలు ఓటీటీ కండీషన్లకు లోబడి కంటెంట్ ని విక్రయించాల్సి వస్తోంది. అయితే కొన్ని సార్లు ఇక్కడ నిర్మాతలకు ఓటీటీ సౌలభ్యం కల్పిస్తున్నట్లు కనిపిస్తుంది. సాధారణంగా ఓటీటీలో సినిమా రిలీజ్ అవ్వాలంటే కనీసం ఆరు వారాల నుంచి ఎనిమిది వారాల వెయిట్ చేయాలి. థియేట్రికల్ రిలీజ్ అనంతరం ఓటీటీలో రిలీజ్ అవ్వాలంటే ఆరు వారాలు తప్పనిసరి.
కానీ ఈ నిబంధన అన్ని సినిమాలకు కాదు కేవలం హిట్ సినిమాలకే అన్నట్లు కనిపిస్తుంది. థియేటర్లో రిలీజ్ అయిన సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందంటే? వీలైనన్ని రోజులు థియేటర్లో ఆడించడానికి నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. థియేటర్ నుంచి ఎక్కువ ఆదాయం రావడంతోనే ఈ రకంగా జరుగుతోంది. అలా హిట్ అయిన సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవ్వాలంటే బుల్లి తెర ప్రేక్షకులు కనీసం 50 రోజులైనా ఎదురు చూడాల్సి వస్తోంది.
ఈ ఏడాది హిట్ అయిన సినిమాలు అదే కోవలో రిలీజ్ అవుతున్నాయి. ఇక ప్లాప్ సినిమా అయితే థియేటర్లో రిలీజ్ అయిన రెండో వారం..మూడవ వారానికి ఓటీటీలోకి వచ్చేస్తుంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన `గేమ్ ఛేంజర్` డిజాస్టర్ అవ్వడంతో ఈ సినిమా 28 రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది. కానీ దీంతో పాటే రిలీజ్ అయిన `డాకు మహరాజ్`, `సంక్రాంతికి వస్తున్నాం` మాత్రం ఓటీటీ రిలీజ్ కి 50 రోజులు పడుతుంది.
ఓటీటీలు ఇలా చేయడం వల్ల నిర్మాతకు ప్లాప్ సినిమా పరంగా సౌలభ్యం దొరుకుతుంది. థియేటర్లో తేలిపోయిన వెంటనే ఓటీటీలో వేయడంతో? సినిమా ఎలా ఉన్నా ఓసారి చూద్దామనే ఆలోచనతో కదులు తున్నారు. అది ఓటీటీలకు కలిసొస్తుంది. దీంతో ఓటీటీలు కూడా నిర్మాతకు రూపాయి చెల్లించే విషయం లో పెద్దగా ఆలోచన చేయడం లేదని ఓటీటీ వర్గాల నుంచి వినిపిస్తుంది.