ఓటీటీ కంటే ముందు టీవీ లోకి వచ్చేస్తున్న సంక్రాంతికి వస్తున్నాం
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతికి రిలీజైన అన్ని సినిమాల కంటే ఎక్కువగా ప్రేక్షకాదరణ పొందింది.
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైన విషయం తెలిసిందే. ప్రాంతీయ చిత్రంగా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డు సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతికి రిలీజైన అన్ని సినిమాల కంటే ఎక్కువగా ప్రేక్షకాదరణ పొందింది.
ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న క్రమంలో అందరికీ ఓ ట్విస్ట్ ఎదురైంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓటీటీలో కంటే ముందే టీవీలోకి రానుందని అప్డేట్ వచ్చింది. ఈ విషయాన్ని జీ తెలుగు అధికారికంగా అనౌన్స్ చేసింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓటీటీలో కంటే ముందుగా జీ తెలుగులో టీవీ ప్రీమియర్ కు రానున్నట్లు జీ సంస్థ తెలిపింది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓటీటీ కంటే ముందు తొలిసారి టీవీలోకే రానుందని ఓ ప్రోమో ను రిలీజ్ చేస్తూ జీ తెలుగు ఛానెల్ తెలిపింది. సంక్రాంతి వైబ్ కు మరోసారి రెడీ అవాలని చెప్తూ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించారు. జీ5లో ఫిబ్రవరి మూడో వారంలోనే సంక్రాంతికి వస్తున్నాం స్ట్రీమింగ్ కు రానుందని వార్తలు వచ్చాయి.
కానీ ఎవరూ ఊహించని విధంగా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం జీ తెలుగు టీవీ ఛానెల్లో ప్రీమియర్ కు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలే ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లలోనే బ్రహ్మరథం పట్టిన సంగతి తెలిసిందే. పండగ సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం విజేతగా నిలవడానికి కారణం కూడా ఫ్యామిలీ ఆడియన్సే.
అయితే ఇప్పుడు ఓటీటీ కంటే ముందుగా టీవీ ఛానెల్ లోకి సినిమా వస్తుండటంతో ఈ విషయం మరింత ఆసక్తికరంగా మారింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా మొదటి సారి టెలివిజన్‌లో ప్రసారమవుతున్న కారణంగా జీ తెలుగు ఛానెల్ కు భారీ టీఆర్పీ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే సినిమా ప్రసారమయ్యే డేట్ ను జీ తెలుగు వెల్లడించనుంది.