ఓటీటీలోకి మ‌రింత లేటుగా డాకు.. ఎందుకంటే!

బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ బాబీ డియోల్ డాకు మ‌హారాజ్ లో విల‌న్ గా న‌టించి అంద‌రినీ మెప్పించాడు.

Update: 2025-02-11 21:30 GMT

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన తాజా చిత్రం డాకు మ‌హారాజ్ మంచి హిట్ అయిన విష‌యం తెలిసిందే. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ లో ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్ గా న‌టించగా శ్ర‌ద్ధా శ్రీనాథ్ కీల‌క పాత్ర‌లో న‌టించింది. బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ బాబీ డియోల్ డాకు మ‌హారాజ్ లో విల‌న్ గా న‌టించి అంద‌రినీ మెప్పించాడు.

సంక్రాంతి సంద‌ర్భంగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్ల‌నే రాబ‌ట్టుకుంది. ఇప్ప‌టికే సినిమా రిలీజై దాదాపు నెల అవుతుండ‌టంతో ఎప్పుడెప్పుడు డాకు మ‌హారాజ్ ఓటీటీలోకి వ‌స్తుందా అని బాల‌య్య ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరో వారంలో సినిమా ఓటీటీలోకి వ‌చ్చేస్తుందిలే అని అంతా అనుకున్నారు.

ఎంత‌లేద‌న్నా ఫిబ్ర‌వ‌రి రెండో వారంలో డాకు మ‌హారాజ్ ఓటీటీలోకి వ‌చ్చేస్తుంద‌ని టాక్ కూడా వ‌చ్చింది. కానీ ఇప్పుడు డాకు మ‌హారాజ్ ఓటీటీ రిలీజ్ మ‌రింత లేట‌య్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. దానికి కార‌ణం డాకు మ‌హారాజ్ ఇంకా కొన్ని థియేట‌ర్ల‌లో బాగా ఆడుతుండ‌ట‌మే. అందుకే సినిమాను కాస్త లేట్ గా ఓటీటీలోకి తీసుకురావాల‌ని చూస్తున్నార‌ట‌.

దానికి తోడు సినిమా రిలీజైన రోజు నుంచి 50 రోజులు పూర్తైన త‌ర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాల‌నే ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ కండిష‌న్‌ ను చిత్ర యూనిట్ తూ.చ త‌ప్ప‌కుండా పాటించాల‌ని చూస్తుందట‌. డాకు మ‌హారాజ్ డిజిట‌ల్ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సినిమా ఎప్పుడైతే థియేట్రిక‌ల్ ర‌న్ ముగించుకుంటుందో అప్పుడే ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని చూస్తున్నార‌ట‌.

అయితే సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేట‌ప్పుడు ఒకేసారి తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం వేరే భాష‌ల‌కు సంబంధించిన డ‌బ్బింగ్ వ‌ర్క్స్ జ‌రుగుతున్నాయ‌ని, ఆ ప‌నులు కాస్త స్లో గా జ‌రుగుతుండ‌టం కూడా డాకు మ‌హారాజ్ ఓటీటీ రిలీజ్ ఆల‌స్యానికి ఒక కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. వీట‌న్నింటినీ బ‌ట్టి చూస్తే డాకు మ‌హారాజ్ మార్చి మొద‌టి వారంలో ఓటీటీలోకి వ‌స్తుంద‌నిపిస్తుంది.

Tags:    

Similar News