టాప్ స్టోరి: హీరోలు మిస్స‌య్యారు!

Update: 2019-03-05 01:30 GMT
ఒక‌ప్పుడు ఓ వెలుగు వెలిగి ఇప్పుడు క‌నిపించ‌క‌పోతే ఆ హీరోల గురించి అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతుంది. ప్ర‌తిభ ఉండీ.. నిరూపించుకుని అటుపై కాల‌గ‌మ‌నంలో అస్స‌లు క‌నిపించ‌కుండా వెళితే అది అభిమానుల‌కు ప‌దే ప‌దే గుర్తుకు వ‌స్తుంది. అలా ఎవ‌రున్నారు? అని వెతికితే టాలీవుడ్ లో ఓ డ‌జ‌ను మంది హీరోలు న‌ట‌న‌కు దూరంగా ఉండ‌డంపై మ‌రోసారి ఆస‌క్తిక‌ర‌ చ‌ర్చ సాగుతోంది. ఆ హీరోల జాబితాని వెతికితే.. త‌రుణ్, వేణు తొట్టెంపూడి, రోహిత్, వ‌డ్డే న‌వీన్, తార‌క ర‌త్న‌, న‌వ‌దీప్, రాజా, రాహుల్, జై ఆకాష్,  దాస‌రి అరుణ్ కుమార్, తనీష్ వంటి పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి.

చాక్లెట్ బోయ్ త‌రుణ్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. స్ర‌వంతి మూవీస్ `నువ్వే కావాలి`  వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ తో హీరో అయ్యి, అటుపై  వ‌రుస‌గా సినిమాల్లో న‌టించాడు. కానీ కాల‌క్ర‌మంలో అత‌డు ప‌లు ర‌కాల వివాదాల్లో ఇరుక్కోవ‌డం కెరీర్ ప‌రంగా మైన‌స్ అయ్యింది. ఇటీవ‌ల తిరిగి త‌రుణ్ రైజ్ మొద‌లైంది అంటూ ప్ర‌చారం చేసినా.. ప్ర‌స్తుతం అత‌డు న‌టిస్తున్న సినిమాల వివ‌రాలేవీ లేవు. కెరీర్ ప‌రంగా ఆ సందిగ్ధ‌త అలానే కొన‌సాగుతోంది. ఇక త‌రుణ్ ప్ర‌స్తుతం వేడెక్కిస్తున్న సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్ ఆట‌గాడిగా స‌రిపెట్టుకున్నాడా? అంటూ అభిమానులు ఆరాలు తీస్తున్నారు. శ‌తాధిక చిత్రాల హీరో శ్రీ‌కాంత్ కి అత్యంత స‌న్నిహితుడైన త‌రుణ్ మ‌ళ్లీ రైజ్ అయ్యేందుకు ప్ర‌య‌త్నించిందే లేదు. ఇక మ‌రో మీరో న‌వ‌దీప్ `చంద‌మామ‌` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ లో న‌టించాడు. ఎన్నో చిత్రాల్లో క‌థానాయ‌కుడిగా న‌టించి, బుల్లితెర‌పైనా రాణించినా ఎందుక‌నో అత‌డు హీరోగా మాత్రం నిల‌దొక్కుకోలేక‌పోయాడు.

చిరున‌వ్వుతో, హ‌నుమాన్ జంక్ష‌న్ స‌హా ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో వేణు తొట్టెంపూడి పెర్ఫామెన్స్ ని అభిమానులు మ‌ర్చిపోలేరు. చ‌క్క‌ని కామెడీ టైమింగ్, ఈజ్ ఉన్న స్టార్ గా అతడు గుర్తున్నాడు. కానీ ఎందుక‌నో అత‌డు కెరీర్ ప‌రంగా పూర్తిగా జీరో అయిపోయాడు. చివ‌రిగా ఎన్టీఆర్ ద‌మ్ములో అతిధిగా న‌టించాడు కానీ త‌ర్వాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా అయినా క‌నిపించ‌లేదు. న‌వ‌వ‌సంతం, 6 టీన్స్ వంటి యూత్ ఫుల్ చిత్రాల్లో న‌టించిన రోహిత్ అద్భుత‌మైన డ్యాన్స‌ర్ అన్న టాక్ తెచ్చుకున్నాడు. న‌టుడిగానూ ఎమోష‌న్ పండించ‌గ‌ల‌డు. కానీ అత‌డు ఇప్ప‌టికీ వెలుగులోకి రాలేదు మ‌ళ్లీ. ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు వారసుడిగా బ‌రిలో దిగిన దాస‌రి అరుణ్ కుమార్ హీరోగా కొన్ని సినిమాల్లో న‌టించినా స‌క్స‌స్ కాలేదు. తిరిగి క్యారెక్ట‌ర్ న‌టుడిగా ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చినా అత‌డు ఇంత‌వ‌ర‌కూ వెలుగు చూడ‌లేదు. క‌మెడియ‌న్ ఎం.ఎస్.నారాయ‌ణ కుమారుడు విక్ర‌మ్ .. నిర్మాత కె.ఎస్.రామారావు కుమారుడు అలెగ్జాండ‌ర్ వ‌ల్ల‌భ‌ సైతం ఇదే తీరుగా న‌టించిన ఒక‌ట్రెండు సినిమాల‌తోనే వెనుదిరిగారు.

గొప్ప నిర్మాత వ‌డ్డే ర‌మేష్‌ వార‌సుడిగా బ‌రిలోకి వ‌చ్చిన వ‌డ్డే న‌వీన్ పెళ్లి వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ తో ఆక‌ట్టుకున్నాడు. డ‌జ‌న్ల కొద్దీ సినిమాల్లో న‌టించినా ఇటీవ‌ల మాత్రం పూర్తిగా తెర‌కు దూర‌మ‌య్యాడు. శ్రీ‌మ‌తి క‌ళ్యాణం వ‌డ్డే న‌వీన్ న‌టించిన చివ‌రి చిత్రం. ఎటాక్ అనే చిత్రంలోనూ న‌టించాడు. ఒకేసారి ఏడు సినిమాల‌తో తెలుగు చ‌ల‌న‌చిత్ర సీమ‌కు ప‌రిచ‌య‌మైన నంద‌మూరి హీరో తార‌క‌ర‌త్న ప్ర‌స్తుత స‌న్నివేశ‌మేంటో తెలిసిందే. తిరిగి రైజ్ అయ్యేందుకు ప్ర‌య‌త్నించినా స‌క్సెస్ రాక, విల‌న్ పాత్ర‌లు క‌లిసి రాక  రేసులో వెనుదిరిగాడు.. తెలుగు, త‌మిళ చిత్రాల్లో న‌టించిన జై ఆకాష్ `ఆనందం` లాంటి క్లాసిక్ హిట్ లో న‌టించాడు. ఆ ఇద్ద‌రు (2013) త‌ర్వాత మ‌ళ్లీ న‌టుడిగా ప్ర‌య‌త్నించిన దాఖ‌లాలు లేవు. ఆనంద్, స్టైల్ వంటి చిత్రాల్లో న‌టించిన రాజా ఇటీవ‌లి కాలంలో పూర్తిగా తెర‌కు దూర‌మ‌య్యాడు. హ్యాపీడేస్ రాహుల్ ప్ర‌య‌త్నం చేసినా కానీ స‌క్సెస్ ద‌క్క‌క ఇటీవ‌ల ఫిలింస‌ర్కిల్స్ నుంచి మిస్స‌య్యాడు. మ‌రో హీరో వ‌రుణ్ సందేశ్ సైతం ఇండ‌స్ట్రీ లో క్రేజీ హీరోగా ఓ వెలుగు వెలిగి స‌క్సెస్ ముఖం చాటేయ‌డంతో కొంత‌కాలంగా ఫిలింస‌ర్కిల్స్ నుంచి మిస్స‌య్యాడు.
    

Tags:    

Similar News